Monday, December 3, 2007

మీకు పురుషుడికి ఎడమ వైపునే స్త్రీ ఎందుకు వుంటుందో తెలుసా?

మీకు పురుషుడికి ఎడమ వైపునే స్త్రీ ఎందుకు వుంటుందో తెలుసా అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెబుతారు. కొంతమంది అయితే హృదయం ఎడమ వైపున వుంటుందని, హాస్యంగా నైతే జేబుకు దగ్గరగా వుంటుందని ఇలా రకరకాలుగా చెబుతారు. అయితే పూర్వకాలం నుంచి కూడా పురుషుడికి ఎడమ వైపునే స్త్రీ వుండడం మనం గమనిస్తుంటాం. దేవుని ఫొటోలు చూస్తే ఈ విషయం మనకు అర్ధమవుతుంది.
అయితే ఇలా వుండడానికి కారణం వుంది. అదేమిటంటే పూర్వకాలం లో పురుషులు అందరూ ఇంచుమించుగా ఆయుధం ధరించేవారు. సాధారణంగా ఇది ఎడమ వైపున వుంటుంది. అంటే దానిని తీయవలసి వస్తే కుడి చేతితో తీయాలి. అటువంటప్పుడు కుడివైపున స్త్రీ వున్నట్లయితే ఆయుధం చేపట్టడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే స్త్రీలు ఎడమ వైపున ఉండేవారు.
కాలక్రమంలో ఆయుధాలు పోయినా ఈ ఎడమ వైపున వుండే సాంప్రదాయం మాత్రం పోలేదు అని అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు ఒప్పో మీ స్పందన తెలియచేయగలరు.


Saturday, November 24, 2007

జ్యోతి-The Light of Telugu Bloggers



జ్యోతి-ఈ పేరు గురించి తెలుగు బ్లాగర్లకు ఎవరూ పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే సంవత్సర పైగా తెలుగు గుంపులో ఉంటూ, తన బ్లాగులలో 1000కి పైగా పోస్టులు చేసి ప్రచండ బ్లాగరి అనే బిరుదు పొందిన ఏకైక తెలుగు మహిళ మన జ్యోతి గారు. జ్యోతి వలబోజు గా కంటే జ్యోతక్కగానే అందరికీ పరిచయం. ఈమె బి.కాం.వరకూ చదివిన సాధారణ గృహిణి అంటే ఎవరికీ నమ్మశక్యం కాదు. అలా వుంటాయి ఆమె రచనలు. ఆమె స్పృశించని విషయం లేదు. ఆవకాయ పచ్చడి నుండి హైదరాబాది బిరియాని వరకూ వంటలు, ఆత్రేయ నుండి హిమేష్ రేష్మియా వరకూ పాటలు, నవ్వుల పువ్వులు పూయించడం దగ్గరనుండి మెదడకు పదును పెట్టి నవ్వించే ఫజిల్స్ వరకూ హాస్యం,పురాణ విషయాలు, కవితలు అన్ని రకాలు ఆమె బ్లాగుల నుండి జాలు వారినవే. వీటన్నిటి కంటే ముఖ్యంగా ఆమె సహన గుణం మరియు సహాయ గుణం గురించి చెప్పు కోవాలి. ఈ పోస్ట్ నేను వ్రాయాలనుకోవడానికి ముఖ్య కారణం అదే. అసలు బ్లాగు అంటే ఏమిటో తెలియని నాలాంటి వారికెందరకో తన అమూల్యమైన సలహాలు,సూచనలతో బ్లాగులు నెలకొల్పడానికి కారణమయ్యారు. ఆవిడ కృషి మూలముగానే మన తెలుగు బ్లాగర్స్ అందరికీ ఉపయోగపడే ఒక సాంకేతిక బ్లాగు తయ్యారయ్యిందని మనకు తెలుసు. అదే నల్లమోతు శ్రీధర్ గారి శ్రీధర్ సాంకేతికాలు. మన తెలుగు బ్లాగర్లు వ్రాసే పోస్టులను చదివి వాటిపై వ్యాఖ్యలు వ్రాస్తూ బ్లాగర్లలో కొత్త ఉత్సాహన్ని నింపుతుంటారు. కంప్యూటర్ ఎరాలో ఆమె వ్రాసిన తెలుగు వెలుగులు వ్యాసం ఆమె కీర్తి కిరీటంలొ ఒక కలికి తురాయి. సార్ధక నామధేయం అంటే ఏమిటో జ్యోతి గారిని చూసాకే తెలిసింది. జ్యోతి ఏ విధంగా తన వెలుగు ద్వారా ఇతరులకు మార్గం చూపుతుందో, మన జ్యోతిగారు కూడా తన సలహాలతో బ్లాగర్లకు దారి చూపిస్తుంటారు. ఆవిడను ఏ విషయం అడిగినా విసుగు చెందక చాలా ఓపికతో చెబుతుంటారు, ఆమెకు తెలియని విషయమైతే, తెలిసిన వారిని అడిగి మరీ మన సందేహాలు తీరుస్తుంటారు. అందుకే ఆవిడను తెలుగు బ్లాగర్లకు వెలుగురేఖ అని పోల్చడంలొ అతిశయోక్తి లేదేమో. మన తెలుగు బ్లాగర్లు గుంపులోని సంఖ్య 1000కు చేరుకుంటున్న శుభసందర్భములో జ్యోతి గారికి అనె బిరుదుని గాని అటువటి సమాన అర్ధం వచ్చే తెలుగు పదంతో గాని సత్కరిస్తే బావుంటుందేమో. మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో వ్రాయండి.

Sunday, October 21, 2007

ఏప్రిల్ 1వ తేదీ ఫూల్స్ డే అని పేరెందుకొచ్చిందో తెలుసా?

ఒక్కొక్క దేశంలో ఒక్కో ఆచార సాంప్రదాయాలు వ్యవహారంలో ఉన్నాయి. వాటి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. వాటిలో ఏప్రిల్ 1 కూడా ఇటువంటి గుర్తింపు పొందిన రోజే. ప్రపంచం మొత్తం ఏప్రిల్ 1ని ఫూల్స్ డేగా పరిగణించడం జరుగుతుంది. ఆ రోజు అందరూ బంధువులను, స్నేహితులను నవ్వించడం, హాస్యాస్పదమైన బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం చేస్తుంటారు. ముందుగా ఏప్రిల్1ని ఫూల్స్ డేగా పరిగణించడం ఫ్రాన్స్ లోని 1564వ సంవత్సరం తరువాత జరిగింది. అంతకు ముందు ఐరొపా ఖండంలోని కొత్త సంవత్సరం ఏప్రిల్1న ప్రారంభం అయ్యింది. అందువలన ఈ రోజున పండుగ వేడుకలు జరుపుకునేవారు. ఆ రోజున ప్రజలు అందరూ బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకునేవారు. స్నేహితుల ఇళ్ళకు విందులకు కూడా వెళ్ళేవారు. ఇలా వుండగా క్రీ.శ. 1564లో ఫ్రాన్స్ రాజు చార్లెస్-10 క్రొత్త క్యాలెండరు వాడమని ఆజ్ఞాపించాడు. ఈ క్యాలెండరు ప్రకారం జనవరి 1తో నూతన సంవత్సరం ప్రారంభమైంది. అప్పుడు చాలామంది ప్రజలు ఈ కొత్త క్యాలెండరును అమలు పరిచారు కాని కొందరు మూర్ఖులు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏప్రిల్ 1నే కొత్త సంవత్సరంగా భావిస్తూ వచ్చారు. అందువలన ఇరుగుపొరుగు వాళ్ళు, స్నేహితులు వీళ్ళను అపహాస్యం చేసేవారు, ఉత్తుత్తి బహుమతులను ఇచ్చేవారు. కనుక ఇటువంటి వారిని ఉద్దేశించి ఉపయోగించిన పదమే 'ఏప్రిల్ ఫూల్శ్. ఈ విధంగా ఏప్రిల్1 ఫూల్స్ డేగా పేరుగాంచింది.

Thursday, October 4, 2007

చేతులకు గాజులు తొడిగించుకోవడం అనేది ఎలా వచ్చిందో మీకు తెలుసా?



చేతులకు గాజులు తొడిగించుకోవడం గురించి ఒక పురాణగాధ వుందిలేండి. అదేమిటంటే జమదగ్ని మహాముని మహా కోపిష్టి. అది జగమెరిగిన సత్యం. అతని భార్య రేణుకా దేవి. ఆవిడ మహా పతివ్రత. అందుచే ఆవిడ ఇసుక రేణువులతో చేసిన కుండతో నీళ్ళు తీసుకు వచ్చేదట. అయితే ఒక రోజు ఆవిడ కుండతో నీళ్ళు తీసుకుని వస్తుండగా దశరధ మహారాజు ఆ దారంటా వెళుతున్నాడట. అపుడు ఆమె ఔరా! ఈ రాజెంత అందగాడు అనుకున్నదట. వెంటనే ఆ కుండ పగిలి పోయిందట. ఆశ్రమానికి వట్టి చేతులతో వచ్చిన రేణుకాదేవిని చూసి, జరిగినదంతా దివ్య దృష్టితొ గ్రహించి వెంటనే కుమారుడైన పరశు రాముడితో నీ తల్లిని నరికేయమన్నడట. పితృవాఖ్య పరిపాలకుడైన పరశురాముడు ఎందుకు ఏమిటి అని అడుగకుండా తల్లిని తన గండ్ర గొడ్డలితో నరికేసాడట. తరువాత తన తల్లి మరణానికి రాజ వంశీయులే కారణమని తలచి వారిపై పగబట్టి అసలు ఈ భూమిపై క్షత్రియుడనేవాడు లేకుండా చేస్తానని ప్రతిన బూని కనిపించిన క్షత్రియుడనల్లా హతమార్చేవాడంట. ఒకసారి అతను అయోధ్యా నగరానికి విచ్చేసాడంట. అప్పటికే అతని గురించి వినివుండటంతో దశరధుడు పారిపోయి రాణి వాసములో దాక్కున్నాడంట. అపుడు పరశు రాముడు రాణి వాసమునకు వచ్చి రాజు ఇక్కడ వున్నడా అని అడిగితే లేరని సమాధనమివ్వగా ఒప్పుకోక మీరంతా వచ్చి నాముందు నిలుచోండి అనగా రాణి వాసపు స్త్రీలు ఎవ్వరూ పరాయి పురుషుని కంట పడరని, కావాలంటే మాచేతులు బయటకు పెడతాము వాతికి వున్న గాజులను మీరు చూడవచ్చును అని తెలుపగా, పరుశరాముడు అలాగే కానిమ్మని పలుకగా దశరధుడు రాణి వాసపు స్త్రీలతో బాటు చేతులకు గాజులు తొడిగించుకుని బైటకు చేతులు బయట పెట్టడత. అపుడు సరేనని పరశు రాముడు వెనుదిరిగాడంట. ఆ విధముగా దశరధుడు ప్రాణాలు కాపాడుకున్నడట. అప్పటినుండి ఎవరైన ఏదైనా ఆపద వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కొనక మూలన కూర్చుంటె చేతులకు గాజులు తొడిగించుకున్నవా అని అనడం పరిపాటి అయ్యిందట. ఇది నా చిన్నపుడు మా పెద్దలు చెప్పగా తెలుసుకున్నాను. ఇందులో ఏవైన దోషాలుంటె తెలియ చేస్తే దిద్దుకుంటాను.

Sunday, September 16, 2007

క్యాలండర్లో సంవత్సరానికి 365 రోజులే వుంటాయి. ఎందుకో మీకు తెలుసా?


భూమి మీద నివసిస్తున్న మనకు భూమి కదులుతున్నట్టుగా ఏమాత్రం అనిపించదు. కాని నిజానికి భూమి నిరంతరంగా వేగంగా కదులుతూనే వుంతుంది. బొంగరం మాదిరిగా తన చుట్టూ తాను గంటకు 800 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూనే వుంటుంది. అదే సమయంలో భూమి అంతరిక్షంలోని సూర్యుని చుట్టూ కూడా తన కక్ష్యలో పరిభ్రమిస్తూ వుంటుంది. అంటే భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి పరిభ్రమించాలంటె 939,886,400 కిలోమీటర్ల దూరం ప్రయానం చేయాలి. ఇందుకోసం ఆశ్చర్యకర రీతిలో గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంత వేగంతో తిరిగినా ఈ దూరాన్ని ప్రయానించేందుకు భూమికి 365.242 రోజులు పడుతుంది. ఈ సమయాన్నే ఒక సంవత్సర కాలంగా లెక్కించి, సంవత్సరానికి 365 రోజులని అంటున్నాము. అయితే అధికంగా వున్న 0.242 రోజుల సమయమును లెక్కిస్తే ఇది నాలుగు సంవత్సరాలకు ఒక రోజు (24 గంటలు) అవుతుంది. అందుకని ఆ ఒక్క రోజును మన క్యాలండర్ లో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కలుపుతాం. ఆ సంవత్సరాన్నే లీపు సంవత్సరంగా పిలుస్తారు.అదండీ విషయం.

Tuesday, September 4, 2007

మీకు కోతి పుండు బ్రహ్మ రాక్షసి అనే సామెత గురించి తెలుసా?

కోతులు సహజంగా సమూహాలుగా గాని, కొన్ని గాని కలసి సంచరిస్తూ ఉంటాయి. అవి చెట్ల మీద నుండి చెట్ల మీదకు ఎగురుతూ వెడుతుంటాయి. ఊళ్ళలొ అయితే ఇళ్ళ ప్రహారీ గోడల మీద ఒకటి వెనుకగా ఒకటి పోతుంటాయి. అలాగే అడవులలో కూడా గుంపులుగానే జీవిస్తుంటాయి. అవి అలా సంచరించేటప్పుడు దెబ్బలు తగలడం వల్ల గాని లేదా వేటగాడు ప్రయోగించిన రాయి లేదా ఆయుధం వల్ల గాని ఒక కోతి గాయపడితే మిగిలిన కోతులు ఆ కోతిని పరామర్శ చేస్తాయి.అలా ప్రతీ కోతి ఆ గాయపడిన కోతిని పరామర్శించేటప్పుడు తన చేతి గోళ్ళతో ఆ గాయాన్ని గోకి చూసి ఏదో ఆకు తెచ్చి దానిమీద వేసి వెడుతుంది. అవి ఆ విధంగా తమ సానుభూతిని, ఆపేక్షను వెల్లడిస్తాయి. కాని ప్రతీ కోతి ఆ గాయాన్ని గోకి చూడడం వల్ల ఆ కోతికి తగిలిన గాయం చిన్నదైనా అది పెద్దగా విస్తరించి చివరికది మానడం దుర్లభమవుతుంది. ఆ కారణంగానే "కోతిపుండు బ్రహ్మ రాక్ష్సి" అనే సామెత వాడుకలోనికి వచ్చింది. ఇది కోతుల నైజాన్ని తెలిపే సామెత. ఆపేక్షతో చేసినప్పటికీ అజ్ఞానులు చేసే పనులు చివరికి బాధగా పరిణమించడాన్ని తెలియజెయడానికి ఈ సామెతతో సూచిస్తారు.

Tuesday, August 28, 2007

ఆడవారి నోట నువ్వు గింజ నానదు అనే సామెత ఎలా వచ్చిందో తెలుసా?

భారత యుద్దం ముగిసిన తరువాత ధర్మరాజు మరణించిన తన బంధు మిత్రులందరికీ పితృకార్యం చేస్తున్నాడు. ఆ సమయంలో కుంతీదేవి కర్ణుడికి కూడా పితృకార్యం నిర్వహించమని ధర్మరాజుకు చెప్పింది. ఆమె అలా కోరడానికి కారణమేమిటని ధర్మరాజు ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు కుంతి తాను కన్యగా వున్నపుడు సూర్యుడి వరం వలన కర్ణుడు తనకు పుట్టిన సంగతి తెలిపింది. ఆ విషయం తెలిసిన ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. కర్ణుడు ఆమెకు తమకంటే ముందుగా పుట్టిన కారణంగా అన్న అవుతాడని, అతడిని తమ చేతులారా చంపామని ఎంతో బాధ పడ్డాడు. అతడికి కుంతిపై విపరీతమైన కోపం వచ్చింది. ఆ విషయం ముందేచెప్పివుంటే అతడితో తమకు వైరం వుండేది కాదని, అసలు భారత యుద్డం సంభవించేదే కాదని పలికి ఆమె ఆ రహస్యం అంతకాలంగా దాచబట్టే ఈ దుష్పరిమాణం ఏర్పడిందని చెప్పి "ఇకపై స్త్రీల నోట రహస్యం దాగదు" అని శపించాడు. ఈ భారత గాధ ఆధారంగానే "స్త్రీల నోట నువ్వు గింజ నానదు" అనే సామెత వాడుకలోకి వచ్చింది. నువ్వుగింజ నానడానికి ఎంతోసమయం పట్టదు. అటువంటి నువ్వుగింజ నానే సమయం స్త్రీలు తమ నోట ఇవ్వరని అర్ధం. స్త్రీలు నిరంతరం ఏదో విషయం మాట్లాడతారని, మాట్లాడక ఊరకనే వుండలేరని దీని భావం. కాని సామాజికంగాను, వైజ్ఞానికంగాను స్త్రీలు అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో ఈ సామెతకి అర్ధం వుండదని చెప్పవచ్చు.

Wednesday, August 22, 2007

మీరు మీ ఇంటిలోనే స్వంతముగా ఒక వెండి గుడ్డు తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

అవునండీ. మీరు మీ ఇంటిలోనే స్వంతముగా ఒక వెండి గుడ్డు తయారు చేసుకోవచ్చు.   ఇప్పుడు వెండి ఎక్కడనుండి తీసుకురాము అనుకునేరు.ఈ గుడ్డుకి నిజమైన వెండి అవసరం లేదు. ఇది ఒక సైన్సు ఇంద్రజాలం. ఇది తయారు చేయడానికి మీకు కావలసినవి. ఒక గుడ్డు, గాజు గ్లాసు, అందులో పూర్తిగా నీరు, ఒక దీపం అవసరం. ముందుగా దీపాన్ని వెలిగించి గుడ్డును దానికి కొంచెం దూరంలో పట్టుకోవాలి దాని పొగ తగిలేటట్టు ఉండాలి. అపుడు గుడ్డు నిండా మసి అంటుకునేటట్టు చూడాలి. గుడ్డు మొత్తం నల్లగా తయారైన తరువాత దానిని జాగ్రత్తగా గాజు గ్లాసులో ఉన్న నీటిలో వేయండి. ఇప్పుడు చూడండి మీకోసం ఒక వెండి గుడ్డు తయారుగా వుంటుంది. నల్లటి గుడ్డు నీటిలో ఎలా మెరిసి పోతుందో మీరే చూడగలరు.

Friday, August 17, 2007

మీకు Numberని No. అని, That is ని i.e. అని, OK అంటే All Correct అని ఎందుకు వ్రాస్తామో తెలుసా?

No. అనునది Latin పదమైన Numero నుండి గాని, Old French పదమైన Nombreనుండి గాని తీసుకొని వుండవచ్చు. అలాగే i.e అనునది Latin పదమైన id est నుండి తీసుకొని వుండవచ్చు దీనికి English లో సమాన అర్ధం that is. OK అనునది orl korrect నుండి తీసుకొని వుండవచ్చు. an early 19th century American phonetic spelling of 'all correct'.

Wednesday, July 25, 2007

ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటపుడు ఎదురు చూసుకొని వెళ్ళాలంటారు. ఎందుకో తెలుసా?

హిందూ సాంప్రదాయాలు పాటించేవాళ్ళు, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటపుడు తప్పనిసరిగా ఎదురు చూసుకొని వెళ్తారు. ఎందుకంటే మంచి ఎదురు వస్తే వాళ్ళ పని ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అయితే ఈ ఎదురు చూడడాన్ని ఈ నవతరం కొట్టిపారేస్తుంది. ప్రస్తుత బిజీ జీవితంలో ఎదురుచూడాలంటే కష్టమే మరి. అయితే ఈ ఎదురు చూడడం అనే ప్రక్రియ వెనుక మంచి ఉద్దేశ్యమే ఉంది. అదేమిటంటే మనము బయటకు వెళ్ళే ప్రతీసారీ ఎదురు చూడము. కేవలం ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మాత్రమే ఎదురు చూస్తాము. ముఖ్యమైన పని అనగానే మనపై సహజంగానే కొంత ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు పని తొందరలో ముఖ్యమైన విషయాలు గాని, వస్తువులు గాని ఇంటిలో మరచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎదురుచూపు అనే మిషతో కాసేపు ఆ వ్యక్తిని ప్రశాంతంగాఉంచగలిగితే తను మరిచిన విషయాలను తను గాని, ఇంటిలోనివారు గాని గుర్తు చేసే అవకాశం వుంది. అంతే కాక తను వెళ్ళే పని తప్పకుండా జరుగుతుందనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది. అందుకోసమే ఈ ఎదురుచూపుల ప్రక్రియ.

Friday, July 20, 2007

ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నపుడు, ఆ దరఖాస్తును స్వదస్తూరీ ఉపయోగించి వ్రాయమంటారు. ఎందుకో మీకు తెలుసా?

సాధారణంగా మనము ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నపుడు, ఆ దరఖాస్తును స్వదస్తూరీ ఉపయోగించి వ్రాయమంటారు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరి వేలిముద్ర ఒకేలా ఎలా ఉండవో అలాగే ఏ ఒక్కరి చేతి వ్రాత కూడా ఒకేలా ఉండదు. మన చేతి వ్రాత మన గురించి ఎన్నో విషయాలు ఎదుటి వారికి తెలియజేస్తుంది. నక్షత్రాలను బట్టి జాతకం చెబితే జ్యోతిష్య శాస్త్రమని, పుట్టిన తారీఖును బట్టి చెబితే సంఖ్యా శాస్త్రమని, అరచేతిలోని రేఖలను బట్టి చెబితే హస్తసాముద్రికం అని ఎలా అంటారో అలాగే మన చేతి వ్రాతను బట్టి మన మనస్తత్వాన్ని విశ్లేషించే శాస్త్రాన్ని చేతి వ్రాత విశ్లేషణా శాస్త్రం లేదా గ్రాఫాలజీ అంటారు. దీనిలో అక్షరాల పరిమాణం, వంపు, పొద్దిక, మార్జిన్ లు, ఒత్తిడి, జారడం, సంతకం వంటి ఎన్నో విషయాలు మన మనస్తత్వాన్ని బయట పెట్టేస్తాయి. అందుకే రక్షణ శాఖ ఉద్యోగాలలో ముందుగా పరిశీలించేది మన చేతి వ్రాతనే. దీని ద్వారా అవతలి వ్యక్తి నమ్మకస్తుడో కాదో తెలుసుకోవచ్చు. అయితే దీని గురించి తెలియని వారు కూడా స్వదస్తూరీ ఉపయోగించి వ్రాయమంటారు ఎందుకో మరి. కొసమెరుపు ఏమిటంటే ఇప్పుడు అమ్మాయిలు తమ ప్రేమికుడును ఎంతవరకూ నమ్మవచ్చూ అనే విషయం తెలుసుకొనేందుకు, వారు వ్రాసిన ప్రేమలేఖలు తీసుకుని గ్రాఫాలజీతో కుస్తీలు పడుతున్నారంట.

Wednesday, July 18, 2007

మీరు ఎప్పుడయినా గుడి చుట్టూ మూడు సార్లు తిరిగారా? పోనీ గుడిలోకి వెళ్ళి వచ్చి గుడి మెట్లపై కూర్చున్నారా?

మన పెద్దలు మనము ఎప్పుడయినా గుడికి వెళ్ళితే, గుడిలోకి వెళ్ళే ముందు,గుడి చుట్టూ మూడు సార్లు తిరిగామంటారు.అలాగే గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం పూర్తి అయిన తరవాత వచ్చి గుడి మెట్లపై కూర్చోమంటారు. ఈ ఆచారం ఎందుకొరకు పెట్టారో తెలుసా? మన పూర్వీకుల కాలంలో శృంగార పరిజ్ఞానం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నంతగా లేదు. ఇప్పుడు కాలంలో యువత సిడీల ద్వారాను, టివీల ద్వారాను, పుస్తకాల ద్వారానూ శృంగార పరిజ్ఞానం సంపాదిస్తున్నారు. అయితే ఆ కాలంలో శృంగారం గురించి తెలియాలంటే కామ శాస్త్రం చదవాల్సి వుండేది. అయితే అది కేవలం ఉన్నత శ్రేణి వారు లేదా పండితులకు మాత్రమే అర్ధమయ్యే భాషలో ఉండేది. అయితే ఆ కాలంలో స్త్రీలు గడప దాటి బయటకు వచ్చే వారు కాదు. సామన్యులకు సైతం ఈ కామశాస్త్రాన్ని అందుబాటులోనికి తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో, ఈ శాస్త్రాన్ని శిల్పకళగా మలచి అందరూ చూసే అవకాశముండునట్లుగా దేవాలయాలపై నిలిపే వారు. కాబట్టి గుడికి వచ్చే భక్తులందరూ వీటిని దర్శించే ఉద్దేశ్యంతో గుడిలోకి వెళ్ళే ముందు,గుడి చుట్టూ మూడు సార్లు తిరిగామన్నారు. అలాగే గాలి గోపురాలపై ఉండే విగ్రహాలను చూడడానికి వీలుగా గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం పూర్తి అయిన తరవాత వచ్చి గుడి మెట్లపై కూర్చోమంటారు. అయితే కొందరు ఈ ఉద్దేశ్యాన్ని గుర్తించలేక అలా తిరిగేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ శిల్పకళా లేదు. వాటి అవసరమూ కనిపించడం లేదు. అంతగా అభివృద్ది చెందింది మన యువత.

Wednesday, July 11, 2007

నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలతాయా?

నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలతాయా? నిప్పుల గుండంలో నడవడమనేది అటు హిందూ సాంప్రదాయంలోనూ, ఇటు మహమ్మదీయ సాంప్రదాయంలోనూ మనకు కనిపిస్తుంటుంది. చాలా మంది తమ కోరికలు తీర్చినట్లయితే నిప్పుల గుండంలో నడుస్తామని మొక్కుకుంటారు. అలాగే ఆ మొక్కును తీరుస్తారు కూడా. అయితే మరి నిప్పులగుండంలో నడిస్తే కాళ్ళు కాలవా? అంటే కాలవు అనే చెప్పాలి. ఎందుకంటే నిప్పుల గుండం పొడవు, వెడల్పు,లోతు అనేది ఒక ప్రత్యేకమైన కొలతల ప్రకారం చేస్తారు. అలాగే అందులోని బొగ్గులను ఒక ఉష్ణొగ్రత వరకూ వేడి చేస్తారు. అదనపు ఉష్ణొగ్రత కొరకు నేతిలో తడిపిన వస్త్రాలను పరుస్తారు. ఇక్కడ నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలక పోవడానికి 2 కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 1. ప్రతీ మనిషి శరీరంలొనూ, అరికాళ్ళలోనూ కొంత తేమ ఉంటుంది. మనం నిప్పులపై కాలు వేసినపుడు ఆ వేడిని అరికాలిలోని తేమ పీల్చుకుంటుంది. కాబట్టి ఈ తేమ ఆరిపోయేలోపల మనము కాలు తీయవలసి వుంటుంది లేనిచో కాళ్ళు కాలిపోయే అవకాశం వుంది. అంతే కాకుండా నిప్పులపై నుశి/బూడిద ఉన్నా కాళ్ళు కాలతాయి. అందుకే బూడిద ఏర్పడకుండా విసురుతుంటారు. అంతేకాకుండా మన శరీరంలొనూ అదనపు తేమ కోసం నిప్పుల గుండంలో నడిచే ముందు తలారా స్నానం చేస్తారు. 2. అలా నడిచే తప్పుడు దైవ నామస్మరణ చేస్తూ తమను తాము హిప్నటైజ్ చేసుకుంటారు. ఈ రెండు కారణాల వల్ల నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలవు.

Tuesday, July 3, 2007

మనము బస్సును చూడగానే అది ఎక్స్ ప్రెస్స్ లేదా ప్యాసింజెర్ బస్సు లేదా పాస్ట్ ప్యాసింజెర్ అనేది వెంటనే తెలుసుకోవచ్చా?

మనము బస్సును చూడగానే అది ఎక్స్ ప్రెస్స్ లేదా ప్యాసింజెర్ బస్సు లేదా పాస్ట్ ప్యాసింజెర్ అనేది వెంటనే తెలుసుకోవచ్చు. అసలు ఆర్.టి.సి. బస్సులలో ఉన్న ముఖ్యమైన రకాలు మూడు.(హైదరాబాదు లాంటి నగరాలలో కాదు). అవి 1. ప్యాసింజెర్ బస్సు, 2. ఎక్స్ ప్రెస్స్, 3. పాస్ట్ ప్యాసింజెర్ బస్సులు.ప్యాసింజెర్ బస్సు ఎక్కువ స్టేజ్ లలో ఆగుతుంది మరియు టికెట్ చార్జీలు కూడా తక్కువ. అదే ఎక్స్ ప్రెస్స్ అయితే తక్కువ లేదా మెయిన్ స్టేజ్ లలో మాత్రమే ఆగుతుంది. టికెట్ చార్జీలు కూడా ఎక్కువ.ఇక పాస్ట్ ప్యాసింజెర్ అయితే తక్కువ లేదా మెయిన్ స్టేజ్ లలో ఆగుతుంది మరియు టికెట్ చార్జీలు తక్కువ. మనకు ఎర్రబస్సు అయితే ప్యాసింజెర్ అని, ఆకుపచ్చ బస్సు అయితే ఎక్స్ ప్రెస్స్ అని తెలుసుకొనేవారము. అయితే ఆర్.టి.సి. వారు అపుడపుడు బస్సులను వారికి వీలుగా ఏ బస్సులు కావాలనుకుంటే ఆ బస్సులను ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టీ ఒక బస్సును చూడగానే అది ప్యాసింజెర్ బస్సా లేక ఎక్స్ ప్రెస్సా లేక పాస్ట్ ప్యాసింజెరా అనేది దానికి తగిలించిన బోర్డును బట్టి తెలుసుకోవచ్చు. నల్లటి అక్షరాలు ఉంటే అది ప్యాసింజెర్,ఎర్రటి అక్షరాలు ఉంటే అది ఎక్స్ ప్రెస్స్, అదే పచ్చటి అక్షరాలు ఉంటే అది పాస్ట్ ప్యాసింజెర్.

Sunday, July 1, 2007

మనము గుడిలోనికి వెళ్ళకుండా అది వైష్ణవాలయమో లేక శివాలయమో చెప్పగలమా?

మనము గుడిలోనికి వెళ్ళకుండా అది వైష్ణవాలయమో లేక శివాలయమో అనేది చాలా సులువుగా చెప్పవచ్చు.వైష్ణవాలయం అనేది విష్ణు మూర్తి కొలువై ఉండే ఆలయం.శివాలయం అనేది పరమశివుదు కొలువై ఉండే ఆలయం. నిలువు బొట్టు పెట్టే వారిని వైష్ణవులు అని, అడ్డబొట్టు పెట్టే వారిని శైవులు అని పిలుస్తారు. వైష్ణవులు విష్ణుమూర్తిని ఆరాధిస్తే, శైవులు సివుని ఆరాధిస్తారు. ఒక ఆలయంలొనికి ప్రవేశించకుండా అది వైష్ణవాలయమో లేక శివాలయమో అనేది చెప్పాలంటే ఆ గుడి గోపురం వంక చూస్తే సరి. వైష్ణవాలయం అయితే శంకు చక్రాలు గోపుర కలశంపై ఉంటాయి. అదే శివాలయం అయితే త్రిశూలం ఉంటుంది.

Friday, June 29, 2007

మీరు ఎప్పుడైనా సింగినాదం జీలకర్ర అనే సామెత విన్నారా? దీనివెనుక చిన్నకధ వుందండీ

సింగినాదం జీలకర్ర అనే సామెత సాధారణంగా ఏదైనా ఒక విషయాన్ని గురించి బాగా గొప్పగా చెప్పి, అక్కడ ఆ విషయం అనుకున్నంత గొప్పగా లేకపోతే ఆ విషయం గురించి విన్నవారు ఆ ఏముంది సింగినాదం జీలకర్ర అనడం పరిపాటి అయిపోయింది.అయితే ఈ సింగినాదం జీలకర్ర అనేది దాని అసలు రూపం అది కాదండీ. శృంగనాదం జీలకర్ర నుండి వచ్చినదే ఈ సింగినాదం జీలకర్ర. దీని వెనుక వున్న అసలు విషయం ఏమిటంటే. పూర్వకాలం బందిపోటు దొంగలు గ్రామాలపై బడి విచ్చలవిడిగా దోపిడీలు, దొంగతనాలు చేస్తుండేవారు. వీరు ఇలా గ్రామాలపై దాడికి వచ్చినపుడు శృంగమనే వాయిద్యాన్ని ఊదుకుంటూ వచ్చే వారు. దాంతో శృంగమనే వాయిద్యం శబ్దం వినగానే ప్రజలందరూ భయ బ్రాంతులతో పారిపోయేవారు. అలాంటి పరిస్థితులలో ఒకానొకరోజు కొంతమంది జీలకర్ర వ్యాపారస్తులు జీలకర్ర అమ్మడానికి గ్రామానికి వచ్చారంట. ఇప్పటికీ మన గ్రామాలలొ ఏదైనా విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయాలంటే చాటింపు ద్వారా తెలియ చేస్తారు. అలాగే జీలకర్ర వ్యాపారస్తులు కూడా జీలకర్ర అమ్ముతామంటూ ఈ శృంగము ఊదుతూ తిరిగారంటా.ఈ శృంగము యొక్క శబ్దం వినగానే ప్రజలందరూ భయ బ్రాంతులతో పారిపోయారంట. కాని ఎంతసేపటికీ ఎటువంటి అలజడి లేకపోవడంతో జనమంతా మెల్లగా బయటికి వచ్చి చూస్తే జీలకర్ర వర్తకులు. అరే శృంగనాదం బందిపోటు దొంగలది కాదు జీలకర్ర వర్తకులది. మనం అనవసరంగా భయపడ్డాం అని ఊపిరి పీల్చుకున్నారంట. అప్పటినుండి లేనివిషయానికి అనవసరంగా రాద్దంతం చేస్తే ఏముంది శృంగనాదం జీలకర్ర అనడం పరిపాటి అయ్యింది. అదే రానురానూ సింగినాదం జీలకర్ర అయ్యింది.

Friday, June 22, 2007

రాత్రి పూట చెట్లక్రింద పడుకొంటే దెయ్యాలు పీక నులిమి లేదా గుండెలపై కూర్చుని చంపేస్తాయి.

రాత్రి పూట చెట్లక్రింద పడుకొంటే దెయ్యాలు పీక నులిమి లేదా గుండెలపై కూర్చుని చంపేస్తాయి. కాబట్టి చెట్ల కింద పడుకోవద్దంటారు. ఇది ఎంతవరకూ నిజం. ఎందుకలా అన్నారు? మీరైతే ఏం చెబుతారు?
అటువంటిది ఏమీలేదు. రాత్రి వేళలలో చెట్లు నిష్కాంతి చర్య చేస్తాయి.నిష్కాంతి చర్య అంటే సూర్యుని కాంతి లేకుండా చేసే చర్య అని అర్ధం. కాంతి చర్యలో చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతుంటాయి. ఆ ఆక్సిజన్ మనిషికి జీవనాధారమని అందరికీ తెలుసు. అలాగే నిష్కాంతి చర్యలో చెట్లు ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డై ఆక్సైడ్ వదులుతుంటాయి. అందుకే రాత్రి వేళలలో చెట్ల కింద పడుకొంటే చెట్లు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ పీల్చవలసి ఉంటుంది. అపుడు మనిషి బతకడానికి సరిపడా ఆక్సిజన్ అందకపోతే గొంతు నులుమినట్లు,గుండెలపై పెద్ద బరువు పెత్తినట్లు అనిపిస్తుందంతే. మరల ఆక్సిజన్ సరిగా అందితే మామూలుగానే వుంటుంది.

పెళ్ళి చేసుకొనేటప్పుడు అమ్మాయి వయసు అబ్బాయి వయసు కన్నా తక్కువ ఉండాలంటారు మన పెద్దలు. ఎందుకో తెలుసా?

పెళ్ళి చేసుకొనేటప్పుడు అమ్మాయి వయసు అబ్బాయి వయసు కన్నా తక్కువ ఉండాలంటారు మన పెద్దలు. ఎందుకో తెలుసా?
ఎందుకంటే శృంగార పరంగా చూస్తే, పురుషులలొ కన్నా స్త్రీలలో శృంగార వాంచలు కొంచం ముందుగానే తగ్గిపోతాయి. ఉదాహరణకి ఒక పురుషుడు 60 సంవత్సరముల వరకూ శృంగార వాంచలు కలిగి ఉంటే స్త్రీ 55 సంవత్సరముల వరకూ మాత్రమే శృంగార వాంచలు కలిగి ఉంటారు. ఎందుకంటే వీరిలో పురుళ్ళు, బహిస్టు వంటి ప్రకృతి కార్యక్రమముల వలన వీరి శరీరం, ఎముకలు త్వరగా బలహీనము అవుటాయి. అందుకే పురుషులలొ కన్నా స్త్రీలలో మెనొపాజ్ స్టేజ్ త్వరగా వస్తుంది. పైన చెప్పిన వయస్సులు కేవలం ఉదాహరణకి తీసుకున్నవి మాత్రమే. మనిషిని బట్టీ, వారి వారి ఆరోగ్య విధానాన్ని బట్టి ఈ వయసు ఆధార పడి ఉంటుంది. అందుకే స్త్రీ పురుషుల మధ్య శృంగార సమన్వయం లో పించకుండా పెళ్ళి చేసుకొనేటప్పుడు అమ్మాయి వయసు అబ్బాయి వయసు కన్నా తక్కువ ఉండాలంటారు. నా వివరణ తప్పయితే క్షమించి సరయిన కారణమును తెలియ చేయగలరు.

Thursday, June 21, 2007

స్త్రీలు బహిస్టు కాలము (మెన్సెస్‌) మూడు రోజులు అందరిలో కలియకుండా ప్రత్యేకముగా వుండేవారు.

స్త్రీలు బహిస్టు కాలము (మెన్సెస్‌) మూడు రోజులు అందరిలో కలియకుండా ప్రత్యేకముగా వుండేవారు.గృహకృత్యాలలొ పాల్గొనేవారు కాదు,విశ్రాంతి తీసుకొనేవారు.దీని వెనుక గల శాస్త్రీయ కారణము యేమై వుండవచ్చు? జాబాలిముని
అని ప్రశ్నించారు. ఇది చాలా సున్నితమైన మరియు స్త్రీల సమస్య. ఇలాంటి వాటిపై వివరణ స్త్రీలు లేదా డాక్టర్స్ అయితే సరిగా ఇవ్వగలరు. నా ఆలోచనా పరిధిలో ఈ బహిస్టు సమయములో స్త్రీలలో ఎక్కువగ రక్త స్రావం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో వారు చాలా నీరసంగా వుంటారు. అలాంటి పరిస్థితులలో ఇంటిపని, వంటపని అంటూ పనులన్నీ చేస్తుంటే వారు ఇంకా నీరసించి పోతారు. ఆ సమయంలో వారికి విశ్రాంతి అవసరం. అలాగే రక్తస్రావం వలన బ్యాక్టీరియా ఇంఫెక్షన్ వచ్చే అవకాసం వుంది. కనుకనే బహిస్టు సమయము మూడు రోజులూ అన్ని రకములైన పనులకూ దూరంగా వుండమంటారు. ఆ సమయంలొ బలవర్ధకమైన ఆహారం మరియు పళ్ళరసాలు తీసుకొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ పనులు మీరు సక్రమంగా చేసుకొవచ్చు. నా అభిప్రాయం తప్పయితే మన్నించగలరు. సహ్రుదయంతో మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తారని ఆశిస్తూ...

Wednesday, June 20, 2007

పెళ్ళిళ్ళకి, శుభకార్యములకు మామిడి తోరణాలు కడతారు. ఎందుకు?

ఎందుకంటే పెళ్ళిళ్ళు, శుభకార్యములు జరిగినపుడు ఆ ప్రదేశంలో ఎక్కువ మంది మనుషులు ఒక చోట చేరుతారు.మనుషులు అందరూ గాలిలో ఉన్న ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డై ఆక్సైడ్ వదులుతుంటారు. కాబట్టి శుభకార్యములు జరిగినప్పుడు గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. అటువంటప్పుడు గాలిలొ ఆక్సిజన్ పెంచడానికి మామిడి తోరణాలు, తాటాకు పందిళ్ళు, అరటి చెట్లతో మండపాలు వంటివి ఏర్పాటు చేస్తారు. ఆకుపచ్చని మొక్కలు అన్ని గాలిలొ ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంటాయి. అందుకని పెళ్ళిళ్ళకి, శుభకార్యములకు మామిడి తోరణాలు కడతారు.

మన సాంప్రదాయాలు వాటి వెనుక వున్న సైంటిఫిక్ కారణాలు గురించి తెలుసు కోవాలనుకుంటున్నారా?

మన నిత్య జీవితంలొ ఎన్నో పనులు మన పెద్దలు చెప్పారనే ఒకే ఒక కారణంతో మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తూ ఉంటాము. అయితే ప్రతీ పని వెనుకా ఒక సైంటిఫిక్ కారణం దాగుంటుంది. ఆ కారణాలు బయటకు తీసే ప్రయత్నంలొ మీరు పాలు కాదు కాదు అభిప్రాయాలు పంచుకోండి.

Sunday, June 17, 2007

**** తెలుగు జాతీయులందరూ గర్వించదగ్గ గీతం **** ఈ మా తెలుగు తల్లికి


మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగలారతులు
కడుపులొ బంగారు, కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలిపోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొర్లుతాయి


అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులొ తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాక

రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ ఆటలే అడుతాం, నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లి!, జై తెలుగు తల్లి!

http://groups.google.com/group/telugusnehithulu

Saturday, June 16, 2007

తెలుగుస్నేహితులు

తెలుగు మాట్లాడే వారందరికీ ఒక విన్నపం. భాషించునది భాష అని అర్ధం. తేనెలొలుకు తీయని భాష మన తెలుగు భాష. అన్ని భాషలను తనలో ఇమడ్చుకోగల సరళమైన ఏకైక భాష మన తెలుగు భాష. అందుకే తెలుగు మాట్లాడే వారందరూ స్నేహితులుగా మారదాం.