Thursday, October 2, 2008

మీకు ప్రేమకు, పెళ్ళికి తేడా ఏమిటో తెలుసా?


మీలో చాలామందికి ప్రేమకు, పెళ్ళికి తేడా ఏమిటో తెలుసుకోవాలని వుంటుంది. చాలా మందికి తెలిసే వుంటుంది. మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియ చేయండి. ఎన్ని తేడాలు వస్తాయో చూద్దాం. ముందుగా నేనే ప్రారంభిస్తా.

ప్రేమలో ఉన్నపుడు ఈమెనే ప్రేమించాలి అనిపిస్తే, 

పెళ్ళి అయిన తరువాత ఈమెనెలా ప్రేమించాను అనిపించడం.

-------------------

భవాని గారు: ప్రేమ మనకోసం. పెళ్ళి మన చుట్టూ ఉన్నవాళ్ళ కోసం.

కత్తి మహేష్ కుమార్ గారు : ప్రేమ ఆనందం కోసం, పెళ్ళి అనుబంధం కోసం

లక్ష్మి గారు : ప్రేమ గుడ్డిది, పెళ్ళి మూగది.

మళ్ళీ నేను : ప్రేమలో ఉన్నపుడు ఇద్దరికీ క్లోజప్ నచ్చితే,

పెళ్ళయ్యాకా ఒకరికి కోల్గేట్ మరొకరికి పెప్సోడెంట్ నచ్చుతుంది.

మరి మీ ఉద్దేశ్యం?



Wednesday, October 1, 2008

పెళ్ళి అయిన వనితలు ఇది చదవకండి.


పెళ్ళి అయిన వనితలు ఇది చదవకండి. ఎందుకంటే ఇక్కడ వ్రాసినవి మీకు కొంచెం కోపం తెప్పించవచ్చు. కాని దయవుంచి మీరు ఏమీ అనుకోకండి. ఇవి భార్యా బాధితుల గురించి. ఇవి కేవలం హాస్యం కోసం మాత్రమే. ఇవి మీకు తెలిసినవే కావచ్చు, మరలా గురుతు తెచ్చుకుని నవ్వుకోవడానికి. 


అతడు: ఎక్కువ కాలం బ్రతకడానికి ఏదైనా అవకాశం వుందా?
డాక్టర్: పెళ్ళి చేసుకోండి.
అతడు: పెళ్ళి చేసుకోంటే బ్రతుకుతానా?
డాక్టర్: లేదు, కాని ఇంకెప్పుడూ ఇలాంటి ఆలోచన రాదు.


పెళ్ళిలో ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటారెందుకు?

ఊరికె, ఫైటింగ్ మొదలు పెట్టేముందు ఇద్దరు బాక్సర్లు షేక్ హేండ్స్ తీసుకుంటారు కదా అలా.

భార్య: ఏమండీ, ఈ రోజు మన పెళ్ళి రోజు కదా, ఏం చేద్దాం?
భర్త: అవునా, అయితే నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం.

జనాలు పెద్దలు కుదిర్చిన వివాహం మంచిదా లేక ప్రేమ వివాహం మంచిదా అని చర్చించుకుంటే నవ్వు వస్తుంది.
ఎందుకంటే హత్య మంచిదా లేక ఆత్మ హత్య మంచిదా అంటే ఎవరు చెప్పగలరు? 

మీకు పెళ్ళి అయిపోతే మీరు ఈ మెసేజ్ చదవకండి. ఇది మీకు కాదు.
మిగిలిన వారికి : స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు 

కుక్కలు పెళ్ళి ఎందుకు చేసుకోవు?
ఎందుకంటే అవి అప్పటికే కుక్కలా బ్రతుకుతున్నాయి కాబట్టి.
 

చట్టం పురుషుడికి రెండవ వివాహాన్ని ఎందుకు అంగీకరించదు?
ఎందుకంటే చట్ట ప్రకారం ఒకేరకమైన తప్పుకి రెండుసార్లు శిక్షించకూడదు కనుక.


Saturday, September 27, 2008

మీకు జగన్మోహినీ కేశవ స్వామి వారి గురించి తెలుసా?


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని ర్యాలి అనే పుణ్య క్షేత్రంలో వెలిసారు శ్రీ జగన్మోహినీ కేశవ స్వామి వారు. ఈ ఆలయానికి ఒక విశిష్టత వున్నది. అదేమిటంటే ఈ ఆలయంలోని మూలవిరాట్ అయినటువంటి శ్రీ జగన్మోహినీ కేశవ స్వామి వారి యొక్క విగ్రహం ముందునుంచి చూస్తే కేశవ స్వామి గాను, వెనుకనుంచి చూస్తే జగన్మోహినీ రూపంలోనూ కనిపిస్తారు. ఈ విగ్రహాన్ని సాలగ్రామ శిలగానూ, స్వయంభువుగానూ చెబుతుంటారు.  ఈ విగ్రహం యొక్క రూప లావణ్యాలను మాటలలో వర్ణించ ఎవరితరమూ కాదు. అంత అత్యధ్బుత సుందర రూపం శ్రీ స్వామి వారిది. అర్చకులు స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని దీపపు వెలుగులో వర్ణిస్తున్నపుడు భక్తి పారవశ్యంలో మునిగిపోక తప్పదు. ముందు శ్రీ స్వామివారు,ప్రక్కనే శ్రీదేవి మరియు భూదేవి,పైన ఆది శేషుడు, పాదాలవద్ద గరుత్మంతుడు, చుట్టూ దశవతారాలు, అటుప్రక్కనే సంగీతాన్ని వినిపిస్తున్న తుంబుర,నారదులు. అంతేకాక శ్రీ స్వామి వారి పాదాల వద్ద చిన్నగా గంగా దేవి మూర్తి వుంటుంది. ఆ మూర్తినుండి ఎల్లపుడూ గంగ ప్రవహిస్తూ వుంటుంది. ఎంత తుడిచినప్పటికీ మరలా వస్తూనే వుంటుంది. అది ఒక మహత్యముగా వర్ణిస్తూ వుంటారు. వెనుకనుండి చూస్తే జగన్మోహినీ రూపం. పట్టు పావడతో, చేతులకూ కాల్లకూ కడియాలతో, ముచ్చటైన తల కొప్పుతో, ఆ కొప్పులో చామంతిపూవుతో, తొడపై పద్మినీ జాతి స్త్రీ లక్షణమైన పుట్టుమచ్చతో అత్యధ్బుతముగా దర్సనమిస్తారు.  

మనిషిలోని అన్ని పాపాలను నాశనం చేసేది కేశవ స్వామి వారి రూపం. మనిషిలోని మోహాన్ని నాశనం చేసేది జగన్మోహినీ రూపం.

Saturday, August 30, 2008

నా ప్రేమలేఖ... నీ ప్రేమ లేక...



హాయ్ వెన్నెల,

ఎలా వున్నావురా? నీవు లేకుండా నేను అస్సలు బాలేను. ఎలా వుండగలుగుతున్నావురా నేను లేకుండా? ఎందుకో తెలియడంలేదు అనుక్షణం నిన్నే చూడాలనిపిస్తుంది.కేవలం నిన్నే చూడాలనిపిస్తుంది. నీ గురించిన వూహలు నన్ను అనుక్షణం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నీ జ్ఞాపకాల దొంతరలను నా చుట్టూ పరచుకుని పరచుకుని వాటిని చూస్తూ మురిసిపోతుంటాను. నా మనసులోని భావాలను అక్షరాలుగా పేర్చి నీ మెడలో వేయడానికి దండగా గుచ్చుతున్నాను. నువ్వు నీ నవ్వు, నీ చూపు, నీ మాట, నీ పేరు ప్రతీదీ నాకు అపురూపమే. నీ కళ్ళళ్ళో మేగ్నటిజం, మాటల్లో హిప్నాటిజం, భావాలలో మెస్మరిజం, పెదాలు కాదన్నా అవునంటూ గుసగుసలాడే కళ్ళు ప్రతీ జ్ఞాపకమూ గుండెల్లొ పదిలమే. అవునా! అంటూ కొద్దిగా తల అలా పక్కకి వాల్చి చూడకు, నా తనువంతా రంగవల్లులతో గిలిగింతలు పెట్టినట్లుంది. నీవు నన్ను చూసే క్షణాన నా మనస్సు పొందే సంతోషం మాటలలో చెప్పలేనురా. నీవు కనిపిస్తే నా కళ్ళల్లొ కోటి సూర్యుల కాంతి, కనిపించకపోతే ఏదో కోల్పోయిన భ్రాంతి. ఏమిట్రా ఇది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? నిన్ను తెలుసుకోవాలనే ప్రయత్నంలో నన్ను నేను కోల్పోతున్నాను. అయినా అది నాకు ఇస్టంగానే వుంది. ఇక్కడ నీకోసం అనుక్షణం ఎదురు చూస్తూ వుంటే అంతా నన్ను పిచ్చివాడు అంటున్నారు. నిజమా? ప్రేమించడం పిచ్చితనం అయితే నేను నిజంగా పిచ్చివాడినే. ఈ పిచ్చివాడికీ ఒక మనసుంటుందనీ అది ఎల్లప్పుడూ నీ కోసమే పలవరిస్తుందని వారికేం తెలుసు? వారేమంటున్నారంటే, ఒక అమ్మాయి నిజంగా మనస్పూర్తిగా ప్రేమించినట్లయితే, తను ప్రేమించిన వాడిని కమ్యూనికేట్ చేయడానికి ఎలా అయినా ప్రయత్నిస్తుంది అని మరి నువ్వు ఎందుకు ప్రయత్నించడం లేదు. నువ్వు పరిస్తితులు అంటున్నావు. నా కోసం నీ ప్రాణానైనా ఇస్తానన్న దానివి. నీ గుండెల్లో నా మీది ప్రేమను ఎలా దాచేయగలుగుతున్నవో నాకు అర్ధం కావడం లేదు. అంతలా ప్రేమించిన ఇలా కూడా వుండగలరా అనిపిస్తుంది. ఆడపిల్లలంటే అంతేనా? వారిని లిక్విడ్స్ తో పోల్చే నా థియరీ తప్పు కాదు అనుకుంటా. ఒక చిన్న కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకోవడానికి నీవు ఎందుకు ప్రయత్నించడం లేదు? కానీ నా గుండె చిన్నదిరా, నీ మీది ప్రేమ దానిని నిలువనివ్వడం లేదు. అనుక్షణం నీదగ్గరే వుండాలని, నీ కళ్ళల్లొకి చూస్తూ, నీ పలుకులు వినాలనిపిస్తుంది. నీ పరిచయం నన్ను ఎంతలా మార్చింది. ప్రతీక్షణం నీ ధ్యాసే, నీ వూహే. నేను నీలా మామూలుగా వుండలేక పోతున్నాను. అందరితోనూ కలసివుండే నేను ఇప్పుడు ఎవ్వరితోనూ సరిగా కలవలేక పోతున్నాను. ఒంటరిగా వుంటూ నీ వూహలలోనే గడుపుతున్నాను. చివరకు ఏమైపోతానో నాకే తెలియడం లేదు. ఎందుకురా నాకు నువ్వంటే నాకింత ప్రేమ?

ప్రేమంటే అందరూ రకరకాల నిర్వచనాలు ఇస్తుంటారు, ప్రే అంటే ప్రేమించడం, మ అంటే మరచి పోవడం అని, ప్రేమిస్తే మరచిపోలేనిదని, రెండు గుండెల చప్పుడు అని, రెండు హృదయాలను దగ్గర చేసి ఎందరికో దూరం చేస్తుందని ఇలా రకరకలుగా అంటుంటారు. కాని నాకు మాత్రం ప్రేమంటే ఒక నువ్వు, ఒక నేను. ఇద్దరం కలిస్తేనే ప్రేమ.   

కళ్ళతో చూసే ప్రేమ కొద్దికాలం వుంటే, పెదలపై పలికే ప్రేమ పదికాలాలు వుంటే, మనసులో పుట్టిన ప్రేమ మనం చనిపోయేంతవరకూ వుంటుంది. మనపృఎమ కూడా మనస్సులో పుట్టి, పెదాలపై పెరిగి మనస్సుతో ముడిపడి పోయింది.

 నేను వచ్చినప్పటినుండీ నా కన్ను నిన్ను వెదకుతూనే వుంటుంది. నీవు లేవని, రావని అది సమయం కాదని తెలుసు. అయినప్పటికీ ఇంతకుమునుపు నీవు నిల్చున్న ప్రదేసం, నడచిన దారి, తాకిన వస్తువులు అన్నిటిలోనూ నేను నిన్ను వెదకుతూనే వుంటాను. నీ వైట్ & మెరూన్ డ్రస్ బావుంది. ఈ మధ్య నీకు నేనున్నను అంటూ నీవు చూసే చూపు బావుంది. నీ రికగ్నిషన్ బావుంది. అన్నీ బావున్నయి. బాలేందల్లా నేనొక్కడినే. 

ప్రేమ ఈ రెండక్షరాలు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో అంత నరకాన్ని చూపిస్తున్నాయి.నీవు కళ్ళముందు ఉన్నపుడు ఉన్న సంతోషం, నీవు కళ్ళముందు కనబడకపోయేసరికి నీకు ఏమైందోనన్న విషాదం నన్ను నిలువనివ్వడం లేదు. అనుక్షణం నీవు సంతోషముగా వుండాలనేరా నాకోరిక. నీ కంటి చూపే తప్ప నోటి మాట కరువయ్యింది. ప్రేమ మనిషిలో ధైర్యాన్ని పెంచుతుందంటారు. మన ప్రేమ నిన్ను మరింత పిరికిదాన్ని చేస్తుందేమిటో? నువ్వంటే ప్రాణము రా. అప్పుడూ, ఈప్పుడూ, ఎప్పుడూ కూడా. నీ ప్రతీ పిలుపుకూ నేను సమాధానమవుతుంటాను. అలా కాలేదంటే నేను జీవించి లేనట్టు తెలుసుకో. వెన్నెల లేని జాబిలిలో ప్రకాశం లేనట్టు, నీవు లేని నాలో ఆనందం లేదు.

ఉవ్వెత్తున ప్రేమ కెరటమై నువ్వు నన్ను తాకి పోతావో లేక ముంచి పోతావో లేక నన్ను నీలో కలిపేసుకుంటావో నీ ఇస్టం. ఏదేమైనా నీవు నన్ను చేరడమే నాకిస్టం. నువ్వు అలవే కావచ్చు కాని కలవి కాకూడదని నా కోరిక. 
నేను నీకెప్పుడు బై చెప్పను ఎందుకంటే కలలోనైనా నీవు నాకు దూరమవడం ఇస్టముండదు కనుక. ఇక వుండనా మరి.

నీ..
జాబిలి.


Monday, February 11, 2008

మీకు గుడిపూడి జంగముల గురించి తెలుసా?

మనము సాధారణంగా ఎవరైనా అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ ప్రగల్భాలు పలికి తరువాత వాటి వూసే ఎత్తని వాళ్ళను చూసి వీళ్ళు గుడిపూడి జంగముల వంటి వాళ్ళు అంటుంటారు. మరి ఈ గుడిపూడి జంగముల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి.
అనగనగా గుడిపూడి అనే ఊరిలో ఎక్కువగా జంగమ దేవరలు నివాసముండేవారు. మీకు జంగమదేవరలు అంటే ఎవరో తెలుసా. ఉదయాన్నే పెద్ద పెద్ద విభూతి రేఖలతో, ఒక చేతిలో గంట, వేరొక చేతిలో త్రిశూలం ధరించి అపర శివునిలా వస్తారే వారు.
వీరు ఊరూరూ తిరుగుతూ బిక్షాటన చేసి సాయంత్రం ఊరిలో ఒకచోట చేరి ఆ రోజు వారు వెళ్ళిన ఊరిలో చూసిన వింతలు విశేషాల గురించి మాట్లాడుకుంటూ అక్కడ ఉన్న మంచి (ఉదాహరణకు మంచినీళ్ళ చెరువు, పెళ్ళి మండపాలు, ఆసుపత్రి, సమావేశ మందిరములు వంటివి) మన ఊరిలో కూడా చేద్దాం అంటూ ఎవరు ఏమిచేయాలో తీర్మానించి దానికి తగ్గ ప్రణాళిక కూడ తయారు చేసుకుంటారు. అవన్ని తప్పనిసరిగా రేపు జరిగిపోవాలంటారు. కాని తెల్లారేసరికి ఎవరి జోలె వారు చంకన వేసుకుని బిక్షటనకు వెల్లిపోతారు. రోజూ ఇదే తంతు. అంతే కాని ఆ పనులు ఎప్పటికీ జరగవు.
అదండీ గుడిపూడి జంగాల కధ.

Sunday, February 3, 2008

మీకు పానకాల స్వామి గురించి తెలుసా?


శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయాలలో ప్రసిద్ది చెందిన స్వామి వారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి అను పుణ్యక్షేత్రము నందు వేంచేసియున్న స్వామి వారు శ్రీ పానకాల లక్ష్మీ నృసింహస్వామి వారు. ఈ స్వామి వారి గురించి తెలుసుకోవలసిన ఆసక్తికర విషయాలు కొన్ని వున్నాయి. ఈ ఆలయం చాలా ఎత్తైన కొండపై ఉన్నది. నా ఉద్దేశ్యంలో ఈ కొండ విజయవాడ కనకదుర్గ అమ్మవారు కొలువై వున్న కొండ కన్న పెద్దది అని అనుకుంటున్నాను. ఈ కొండపైకి కాలినడకన కాని,వాహనము ద్వారా గాని చేరుకోవచ్చు.
ఈ స్వామి వారిని పానకాల స్వామి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని వెనుక ఒక పురాణ గాధ కూడా వున్నదట. నాకు తెలిసినంత వరకు సంక్షిప్తంగా ఇక్కడ స్వామి వారు చాలా ఉగ్ర రూపంతో వెలసినారట. ఆయనను శాంతింప చేయడానికి నోటిలో పానకము పోస్తారట. అయితే ఇక్కడి విశేషమేమిటంటే భక్తులు స్వామి వారి నోటిలో పానకం పోయడానికి చెంబులతో గాని, బిందెలతో గాని తీసుకెళతారు. అర్చక స్వామి వారు పానకం స్వామి నోటిలో పోసేటపుడు ఒక మనిషి మంచినీళ్ళు తాగితే ఏ విధంగా అయితే గుడ గుడమని అబ్ధం వినిపిస్తుందో అలా గుడ గుడమని వినిపిస్తుంది. అంతే కాదు మనము తీసుకెళ్ళిన పాత్రలో సగం పానకం అయిపోగానే ఇక స్వామి వారు తాగటం ఆపేస్తారు.అది ఎటువంటి పాత్ర అయినా సరే సగం మాత్రమే తాగుతారు. ఆ మిగిలిన పానకాన్నే భక్తులకు ప్రసాదముగా ఇస్తారు.అలాగే పటిక బెల్లము మరియు కర్జూరము కూడా ప్రసాదముగా లభించును. ఇక్కడ వున్న మరో విశేషమేమిటంటే ఇంతమంది భక్తులు పోసిన పానకం ఎక్కడకు పోతుందో ఎవరికీ తెలియదు. అంతేకాదు ఇంత బెల్లం పానకం అక్కడ పోస్తున్నప్పటికీ ఆ ప్రాంతములో ఒక చీమ గాని ఈగ గాని మనకు కనిపించదు. ఇవి అన్ని చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు.
ఆస్తికులు ఇది అంతా స్వామి వారి మహత్యం అని అంటుంటే, నాస్తికులు మాత్రం అదేంలేదు అది ఒక ఘనీభవించిన అగ్నిపర్వతం అదిమరల విస్పొటనం చెందకుందా చల్లర్చడానికి ఈ పానకం అని,అగ్నిపర్వతం వలనే ఈగలు, చీమలు రావని అంటుంటారు.
ఇవీ నాకు తెలిసిన విశేషాలు. మీకు నేను చెప్పిన విశేషాలే కాకుండా ఏమైనా కొత్తవి తెలిసినా నేను వ్రాసిన విశేషాలలో ఏవైన పొరపాట్లు ఉన్నట్లయితే వ్యాఖ్యల రూపంలో తెలియ చెసినా సరిదిద్దు కుంటాను.


Sunday, January 27, 2008

జీర్ణం...జీర్ణం... వాతాపి జీర్ణం గురించి తెలుసా?


మన ఇంటిలో చిన్న పిల్లలకు ఏదైనా పెట్టిన తరువాత, ఆ తిన్నది అరగడం గురించి వారి చిన్ని పొట్టపై సుతారంగా రాస్తూ జీర్ణం...జీర్ణం... వాతాపి జీర్ణం అంటుంటారు. దీని వెనుకాల ఒక పురాణ గాధ వుంది. ఈ జీర్ణం ... జీర్ణం ... వాతాపి జీర్ణం గురించిన ప్రస్తావన త్రేతాయుగం నాటి రామాయణములో అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం గురించి తెలియచేస్తూ వస్తుంది.
పూర్వకాలంలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీరు నరమాంస భక్షకులై దారిన పోతున్న బ్రాహ్మణులను మాయ చేసి భక్షిస్తుండేవారు. అదేలాగంటే ఇల్వలుడు బ్రాహ్మణ రూపం, వాతాపి గొర్రె రూపం ధరించి బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి, అయ్యా ఈ రోజు మా తండ్రిగారి ఆబ్దికము,తిధి తద్దినము పెట్టాలి గాబట్టీ మీరు దయచేసి భోక్తగా రండి అని పిలిచేవాడు.సర్వసాధారణంగా తండ్రి గారి తద్దిణానికి భోక్త పిలిస్తే ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప రాను అని అనకూడదు. అందుకని బ్రాహ్మణులను వెళ్ళేవారు. అపుడు గొర్రెని ఇల్వలుడు చంపేసేవాడు. చంపేసి ఆ మాంసం వండేవాడు. వండి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులకు విస్తట్లో వడ్డించేవాడు. బ్రాహ్మణులను ఆ మాంసం తినేవారు.తిన్నతరువాత హస్తోదకం ఇచ్చేవాడు. అలా ఇచ్చి వాతాపి రా... అనేవాడు. అపుడు కడుపులో మాంస రూపంలో వున్న వాతాపి గొర్రె రూపం దాల్చి కడుపు చీల్చుకుని వచ్చే వాడు. దానితో బ్రాహ్మణుడు చనిపోయేవాడు. అప్పుడు రాక్షసులు ఇద్దరూ ఆ మాంసాన్ని భుజించేవారు. 
అలా చాలాకాలం జరిగిన తరువాత అటుగా అగస్త్య మహర్షి వస్తున్నారు. ఎప్పటిలానే మాయా రూపాలు ధరించడం, మహర్షిని రమ్మనడం, భోజనం పెట్టడం చేసాడు. మహర్షి భోంచేసిన తరువాత పొట్టపై చేయి ఉంచుకుని సుతారంగ రాసుకుంటూ జీర్ణం...జీర్ణం... వాతాపి జీర్ణం అనుకున్నారు. దానితో కడుపులో ఉన్న వాతాపి కాస్తా జీర్ణం అయిపోయాడు. ఇక ఇల్వలుడు వాతాపి రా... అని పిలిస్తే ఇంకేం వాతాపి ఎప్పుడొ జీర్నమయిపోయాడు అన్నరు. దానితో ఆగ్రహించిన ఇల్వలుడు భయంకర రూపం దాల్చి అగస్తుడిని చంపడానికి వస్తుంటే మహరిషి కోపంతో ఒక్కసారి హుంకరించాగానే ఆ ఇల్వలుడు భస్మమైపోయాడు.
అప్పటి నుండి తిన్న పధార్ధమేదైనా అరగక ఇబ్బంది పెడుతుంటే జీర్ణం...జీర్ణం... వాతాపి జీర్ణం అనడం పరిపాటి అయిపోయింది.



Wednesday, January 23, 2008

ఇంటిలో ప్రతీరోజూ తులసి మొక్కని పూజించాలంటారు ఎందుకు?


ఇంటిలో ప్రతీరోజూ తులసి మొక్కని పూజించినా, పూజించక పోయినా తులసిమొక్కని మాత్రము తప్పనిసరిగా పెంచాలి. ఎందుకంటే తులసి యొక్క ఔషధ గుణములను ద్రుష్టిలో ఉంచుకుని మన పెద్దలు పెరటిలో తులసి మొక్కను పూజించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. తులసి నుండి వచ్చే గాలి పీల్చినట్లయితే కలరా వంటి వ్యాధులు దరి చేరవు.
ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే లక్శణం తులసికి వుంది. అందుకే అన్ని రకముల అవకాశములు ప్రయత్నించిన 
తరువాత ఆఖరి ప్రయత్నముగా తులసి తీర్ధము నోటిలో పోస్తారు.