Saturday, August 30, 2008

నా ప్రేమలేఖ... నీ ప్రేమ లేక...హాయ్ వెన్నెల,

ఎలా వున్నావురా? నీవు లేకుండా నేను అస్సలు బాలేను. ఎలా వుండగలుగుతున్నావురా నేను లేకుండా? ఎందుకో తెలియడంలేదు అనుక్షణం నిన్నే చూడాలనిపిస్తుంది.కేవలం నిన్నే చూడాలనిపిస్తుంది. నీ గురించిన వూహలు నన్ను అనుక్షణం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నీ జ్ఞాపకాల దొంతరలను నా చుట్టూ పరచుకుని పరచుకుని వాటిని చూస్తూ మురిసిపోతుంటాను. నా మనసులోని భావాలను అక్షరాలుగా పేర్చి నీ మెడలో వేయడానికి దండగా గుచ్చుతున్నాను. నువ్వు నీ నవ్వు, నీ చూపు, నీ మాట, నీ పేరు ప్రతీదీ నాకు అపురూపమే. నీ కళ్ళళ్ళో మేగ్నటిజం, మాటల్లో హిప్నాటిజం, భావాలలో మెస్మరిజం, పెదాలు కాదన్నా అవునంటూ గుసగుసలాడే కళ్ళు ప్రతీ జ్ఞాపకమూ గుండెల్లొ పదిలమే. అవునా! అంటూ కొద్దిగా తల అలా పక్కకి వాల్చి చూడకు, నా తనువంతా రంగవల్లులతో గిలిగింతలు పెట్టినట్లుంది. నీవు నన్ను చూసే క్షణాన నా మనస్సు పొందే సంతోషం మాటలలో చెప్పలేనురా. నీవు కనిపిస్తే నా కళ్ళల్లొ కోటి సూర్యుల కాంతి, కనిపించకపోతే ఏదో కోల్పోయిన భ్రాంతి. ఏమిట్రా ఇది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? నిన్ను తెలుసుకోవాలనే ప్రయత్నంలో నన్ను నేను కోల్పోతున్నాను. అయినా అది నాకు ఇస్టంగానే వుంది. ఇక్కడ నీకోసం అనుక్షణం ఎదురు చూస్తూ వుంటే అంతా నన్ను పిచ్చివాడు అంటున్నారు. నిజమా? ప్రేమించడం పిచ్చితనం అయితే నేను నిజంగా పిచ్చివాడినే. ఈ పిచ్చివాడికీ ఒక మనసుంటుందనీ అది ఎల్లప్పుడూ నీ కోసమే పలవరిస్తుందని వారికేం తెలుసు? వారేమంటున్నారంటే, ఒక అమ్మాయి నిజంగా మనస్పూర్తిగా ప్రేమించినట్లయితే, తను ప్రేమించిన వాడిని కమ్యూనికేట్ చేయడానికి ఎలా అయినా ప్రయత్నిస్తుంది అని మరి నువ్వు ఎందుకు ప్రయత్నించడం లేదు. నువ్వు పరిస్తితులు అంటున్నావు. నా కోసం నీ ప్రాణానైనా ఇస్తానన్న దానివి. నీ గుండెల్లో నా మీది ప్రేమను ఎలా దాచేయగలుగుతున్నవో నాకు అర్ధం కావడం లేదు. అంతలా ప్రేమించిన ఇలా కూడా వుండగలరా అనిపిస్తుంది. ఆడపిల్లలంటే అంతేనా? వారిని లిక్విడ్స్ తో పోల్చే నా థియరీ తప్పు కాదు అనుకుంటా. ఒక చిన్న కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకోవడానికి నీవు ఎందుకు ప్రయత్నించడం లేదు? కానీ నా గుండె చిన్నదిరా, నీ మీది ప్రేమ దానిని నిలువనివ్వడం లేదు. అనుక్షణం నీదగ్గరే వుండాలని, నీ కళ్ళల్లొకి చూస్తూ, నీ పలుకులు వినాలనిపిస్తుంది. నీ పరిచయం నన్ను ఎంతలా మార్చింది. ప్రతీక్షణం నీ ధ్యాసే, నీ వూహే. నేను నీలా మామూలుగా వుండలేక పోతున్నాను. అందరితోనూ కలసివుండే నేను ఇప్పుడు ఎవ్వరితోనూ సరిగా కలవలేక పోతున్నాను. ఒంటరిగా వుంటూ నీ వూహలలోనే గడుపుతున్నాను. చివరకు ఏమైపోతానో నాకే తెలియడం లేదు. ఎందుకురా నాకు నువ్వంటే నాకింత ప్రేమ?

ప్రేమంటే అందరూ రకరకాల నిర్వచనాలు ఇస్తుంటారు, ప్రే అంటే ప్రేమించడం, మ అంటే మరచి పోవడం అని, ప్రేమిస్తే మరచిపోలేనిదని, రెండు గుండెల చప్పుడు అని, రెండు హృదయాలను దగ్గర చేసి ఎందరికో దూరం చేస్తుందని ఇలా రకరకలుగా అంటుంటారు. కాని నాకు మాత్రం ప్రేమంటే ఒక నువ్వు, ఒక నేను. ఇద్దరం కలిస్తేనే ప్రేమ.   

కళ్ళతో చూసే ప్రేమ కొద్దికాలం వుంటే, పెదలపై పలికే ప్రేమ పదికాలాలు వుంటే, మనసులో పుట్టిన ప్రేమ మనం చనిపోయేంతవరకూ వుంటుంది. మనపృఎమ కూడా మనస్సులో పుట్టి, పెదాలపై పెరిగి మనస్సుతో ముడిపడి పోయింది.

 నేను వచ్చినప్పటినుండీ నా కన్ను నిన్ను వెదకుతూనే వుంటుంది. నీవు లేవని, రావని అది సమయం కాదని తెలుసు. అయినప్పటికీ ఇంతకుమునుపు నీవు నిల్చున్న ప్రదేసం, నడచిన దారి, తాకిన వస్తువులు అన్నిటిలోనూ నేను నిన్ను వెదకుతూనే వుంటాను. నీ వైట్ & మెరూన్ డ్రస్ బావుంది. ఈ మధ్య నీకు నేనున్నను అంటూ నీవు చూసే చూపు బావుంది. నీ రికగ్నిషన్ బావుంది. అన్నీ బావున్నయి. బాలేందల్లా నేనొక్కడినే. 

ప్రేమ ఈ రెండక్షరాలు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో అంత నరకాన్ని చూపిస్తున్నాయి.నీవు కళ్ళముందు ఉన్నపుడు ఉన్న సంతోషం, నీవు కళ్ళముందు కనబడకపోయేసరికి నీకు ఏమైందోనన్న విషాదం నన్ను నిలువనివ్వడం లేదు. అనుక్షణం నీవు సంతోషముగా వుండాలనేరా నాకోరిక. నీ కంటి చూపే తప్ప నోటి మాట కరువయ్యింది. ప్రేమ మనిషిలో ధైర్యాన్ని పెంచుతుందంటారు. మన ప్రేమ నిన్ను మరింత పిరికిదాన్ని చేస్తుందేమిటో? నువ్వంటే ప్రాణము రా. అప్పుడూ, ఈప్పుడూ, ఎప్పుడూ కూడా. నీ ప్రతీ పిలుపుకూ నేను సమాధానమవుతుంటాను. అలా కాలేదంటే నేను జీవించి లేనట్టు తెలుసుకో. వెన్నెల లేని జాబిలిలో ప్రకాశం లేనట్టు, నీవు లేని నాలో ఆనందం లేదు.

ఉవ్వెత్తున ప్రేమ కెరటమై నువ్వు నన్ను తాకి పోతావో లేక ముంచి పోతావో లేక నన్ను నీలో కలిపేసుకుంటావో నీ ఇస్టం. ఏదేమైనా నీవు నన్ను చేరడమే నాకిస్టం. నువ్వు అలవే కావచ్చు కాని కలవి కాకూడదని నా కోరిక. 
నేను నీకెప్పుడు బై చెప్పను ఎందుకంటే కలలోనైనా నీవు నాకు దూరమవడం ఇస్టముండదు కనుక. ఇక వుండనా మరి.

నీ..
జాబిలి.