Sunday, February 3, 2008

మీకు పానకాల స్వామి గురించి తెలుసా?


శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయాలలో ప్రసిద్ది చెందిన స్వామి వారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి అను పుణ్యక్షేత్రము నందు వేంచేసియున్న స్వామి వారు శ్రీ పానకాల లక్ష్మీ నృసింహస్వామి వారు. ఈ స్వామి వారి గురించి తెలుసుకోవలసిన ఆసక్తికర విషయాలు కొన్ని వున్నాయి. ఈ ఆలయం చాలా ఎత్తైన కొండపై ఉన్నది. నా ఉద్దేశ్యంలో ఈ కొండ విజయవాడ కనకదుర్గ అమ్మవారు కొలువై వున్న కొండ కన్న పెద్దది అని అనుకుంటున్నాను. ఈ కొండపైకి కాలినడకన కాని,వాహనము ద్వారా గాని చేరుకోవచ్చు.
ఈ స్వామి వారిని పానకాల స్వామి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని వెనుక ఒక పురాణ గాధ కూడా వున్నదట. నాకు తెలిసినంత వరకు సంక్షిప్తంగా ఇక్కడ స్వామి వారు చాలా ఉగ్ర రూపంతో వెలసినారట. ఆయనను శాంతింప చేయడానికి నోటిలో పానకము పోస్తారట. అయితే ఇక్కడి విశేషమేమిటంటే భక్తులు స్వామి వారి నోటిలో పానకం పోయడానికి చెంబులతో గాని, బిందెలతో గాని తీసుకెళతారు. అర్చక స్వామి వారు పానకం స్వామి నోటిలో పోసేటపుడు ఒక మనిషి మంచినీళ్ళు తాగితే ఏ విధంగా అయితే గుడ గుడమని అబ్ధం వినిపిస్తుందో అలా గుడ గుడమని వినిపిస్తుంది. అంతే కాదు మనము తీసుకెళ్ళిన పాత్రలో సగం పానకం అయిపోగానే ఇక స్వామి వారు తాగటం ఆపేస్తారు.అది ఎటువంటి పాత్ర అయినా సరే సగం మాత్రమే తాగుతారు. ఆ మిగిలిన పానకాన్నే భక్తులకు ప్రసాదముగా ఇస్తారు.అలాగే పటిక బెల్లము మరియు కర్జూరము కూడా ప్రసాదముగా లభించును. ఇక్కడ వున్న మరో విశేషమేమిటంటే ఇంతమంది భక్తులు పోసిన పానకం ఎక్కడకు పోతుందో ఎవరికీ తెలియదు. అంతేకాదు ఇంత బెల్లం పానకం అక్కడ పోస్తున్నప్పటికీ ఆ ప్రాంతములో ఒక చీమ గాని ఈగ గాని మనకు కనిపించదు. ఇవి అన్ని చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు.
ఆస్తికులు ఇది అంతా స్వామి వారి మహత్యం అని అంటుంటే, నాస్తికులు మాత్రం అదేంలేదు అది ఒక ఘనీభవించిన అగ్నిపర్వతం అదిమరల విస్పొటనం చెందకుందా చల్లర్చడానికి ఈ పానకం అని,అగ్నిపర్వతం వలనే ఈగలు, చీమలు రావని అంటుంటారు.
ఇవీ నాకు తెలిసిన విశేషాలు. మీకు నేను చెప్పిన విశేషాలే కాకుండా ఏమైనా కొత్తవి తెలిసినా నేను వ్రాసిన విశేషాలలో ఏవైన పొరపాట్లు ఉన్నట్లయితే వ్యాఖ్యల రూపంలో తెలియ చెసినా సరిదిద్దు కుంటాను.


3 comments:

Anurup said...

పానకాల స్వామి పేరు విన్నట్టు గుర్తు కాని చరిత్ర మహిమ గురించి ఇక్కడే చదవడం. చాల బాగుంది.

క్రాంతి said...

సీతారాం గారు,
చాలా బాగా రాసారు,నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా తెలుగు మాష్టారు ఒకసారి చెప్పారు పానకాల స్వామి గురించి.

రఘువీర్ said...

నాస్తికుల వాదం తీసుకున్నా కూడా ఒక నివారణ చర్యగా పానకం పోయడం మన ధర్మంలో ఒక మంచి లక్షణం