Saturday, September 27, 2008

మీకు జగన్మోహినీ కేశవ స్వామి వారి గురించి తెలుసా?


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని ర్యాలి అనే పుణ్య క్షేత్రంలో వెలిసారు శ్రీ జగన్మోహినీ కేశవ స్వామి వారు. ఈ ఆలయానికి ఒక విశిష్టత వున్నది. అదేమిటంటే ఈ ఆలయంలోని మూలవిరాట్ అయినటువంటి శ్రీ జగన్మోహినీ కేశవ స్వామి వారి యొక్క విగ్రహం ముందునుంచి చూస్తే కేశవ స్వామి గాను, వెనుకనుంచి చూస్తే జగన్మోహినీ రూపంలోనూ కనిపిస్తారు. ఈ విగ్రహాన్ని సాలగ్రామ శిలగానూ, స్వయంభువుగానూ చెబుతుంటారు.  ఈ విగ్రహం యొక్క రూప లావణ్యాలను మాటలలో వర్ణించ ఎవరితరమూ కాదు. అంత అత్యధ్బుత సుందర రూపం శ్రీ స్వామి వారిది. అర్చకులు స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని దీపపు వెలుగులో వర్ణిస్తున్నపుడు భక్తి పారవశ్యంలో మునిగిపోక తప్పదు. ముందు శ్రీ స్వామివారు,ప్రక్కనే శ్రీదేవి మరియు భూదేవి,పైన ఆది శేషుడు, పాదాలవద్ద గరుత్మంతుడు, చుట్టూ దశవతారాలు, అటుప్రక్కనే సంగీతాన్ని వినిపిస్తున్న తుంబుర,నారదులు. అంతేకాక శ్రీ స్వామి వారి పాదాల వద్ద చిన్నగా గంగా దేవి మూర్తి వుంటుంది. ఆ మూర్తినుండి ఎల్లపుడూ గంగ ప్రవహిస్తూ వుంటుంది. ఎంత తుడిచినప్పటికీ మరలా వస్తూనే వుంటుంది. అది ఒక మహత్యముగా వర్ణిస్తూ వుంటారు. వెనుకనుండి చూస్తే జగన్మోహినీ రూపం. పట్టు పావడతో, చేతులకూ కాల్లకూ కడియాలతో, ముచ్చటైన తల కొప్పుతో, ఆ కొప్పులో చామంతిపూవుతో, తొడపై పద్మినీ జాతి స్త్రీ లక్షణమైన పుట్టుమచ్చతో అత్యధ్బుతముగా దర్సనమిస్తారు.  

మనిషిలోని అన్ని పాపాలను నాశనం చేసేది కేశవ స్వామి వారి రూపం. మనిషిలోని మోహాన్ని నాశనం చేసేది జగన్మోహినీ రూపం.

3 comments:

Gopal said...

ఈ ర్యాలి స్వామివారికి ఇంకొక విషిష్టత కూడా ఉంది. ట్రాన్స్ ఫర్ కావాలనుకున్న ప్రభుత్యోద్యోగులు ఇత్యాదులు ఈ దేవుని దర్శించితే ట్రాన్స్ ఫర్ అవుతుందనే నమ్మకం ఉంది. నేను ట్రాన్స్ ఫర్ కోసం దర్శనం చేసుకున్నా కాని ఇంతవరకూ ఆయన కరుణించలేదు. అది వేరే విషయం.

Chandra said...

ఈ స్వామివారిని నేను చాలా ఏళ్ల క్రితం (1993 అనుకుంటా) దర్శించుకున్నాను. నాకప్పుడు 22 సం||లు. ఇప్పటికీ మర్చిపోలేను ఆ దివ్య మంగళ సుందర రూపాన్ని!! అది ఒకసారి దర్శిస్తే చాలు .వాహ్. అనకుండా ఉండలేరు ఎవ్వరూ!!

వాత్సల్య said...

Informative post. Thank you. Will try to go this time