Wednesday, July 25, 2007

ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటపుడు ఎదురు చూసుకొని వెళ్ళాలంటారు. ఎందుకో తెలుసా?

హిందూ సాంప్రదాయాలు పాటించేవాళ్ళు, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటపుడు తప్పనిసరిగా ఎదురు చూసుకొని వెళ్తారు. ఎందుకంటే మంచి ఎదురు వస్తే వాళ్ళ పని ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అయితే ఈ ఎదురు చూడడాన్ని ఈ నవతరం కొట్టిపారేస్తుంది. ప్రస్తుత బిజీ జీవితంలో ఎదురుచూడాలంటే కష్టమే మరి. అయితే ఈ ఎదురు చూడడం అనే ప్రక్రియ వెనుక మంచి ఉద్దేశ్యమే ఉంది. అదేమిటంటే మనము బయటకు వెళ్ళే ప్రతీసారీ ఎదురు చూడము. కేవలం ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మాత్రమే ఎదురు చూస్తాము. ముఖ్యమైన పని అనగానే మనపై సహజంగానే కొంత ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు పని తొందరలో ముఖ్యమైన విషయాలు గాని, వస్తువులు గాని ఇంటిలో మరచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎదురుచూపు అనే మిషతో కాసేపు ఆ వ్యక్తిని ప్రశాంతంగాఉంచగలిగితే తను మరిచిన విషయాలను తను గాని, ఇంటిలోనివారు గాని గుర్తు చేసే అవకాశం వుంది. అంతే కాక తను వెళ్ళే పని తప్పకుండా జరుగుతుందనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది. అందుకోసమే ఈ ఎదురుచూపుల ప్రక్రియ.

Friday, July 20, 2007

ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నపుడు, ఆ దరఖాస్తును స్వదస్తూరీ ఉపయోగించి వ్రాయమంటారు. ఎందుకో మీకు తెలుసా?

సాధారణంగా మనము ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నపుడు, ఆ దరఖాస్తును స్వదస్తూరీ ఉపయోగించి వ్రాయమంటారు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరి వేలిముద్ర ఒకేలా ఎలా ఉండవో అలాగే ఏ ఒక్కరి చేతి వ్రాత కూడా ఒకేలా ఉండదు. మన చేతి వ్రాత మన గురించి ఎన్నో విషయాలు ఎదుటి వారికి తెలియజేస్తుంది. నక్షత్రాలను బట్టి జాతకం చెబితే జ్యోతిష్య శాస్త్రమని, పుట్టిన తారీఖును బట్టి చెబితే సంఖ్యా శాస్త్రమని, అరచేతిలోని రేఖలను బట్టి చెబితే హస్తసాముద్రికం అని ఎలా అంటారో అలాగే మన చేతి వ్రాతను బట్టి మన మనస్తత్వాన్ని విశ్లేషించే శాస్త్రాన్ని చేతి వ్రాత విశ్లేషణా శాస్త్రం లేదా గ్రాఫాలజీ అంటారు. దీనిలో అక్షరాల పరిమాణం, వంపు, పొద్దిక, మార్జిన్ లు, ఒత్తిడి, జారడం, సంతకం వంటి ఎన్నో విషయాలు మన మనస్తత్వాన్ని బయట పెట్టేస్తాయి. అందుకే రక్షణ శాఖ ఉద్యోగాలలో ముందుగా పరిశీలించేది మన చేతి వ్రాతనే. దీని ద్వారా అవతలి వ్యక్తి నమ్మకస్తుడో కాదో తెలుసుకోవచ్చు. అయితే దీని గురించి తెలియని వారు కూడా స్వదస్తూరీ ఉపయోగించి వ్రాయమంటారు ఎందుకో మరి. కొసమెరుపు ఏమిటంటే ఇప్పుడు అమ్మాయిలు తమ ప్రేమికుడును ఎంతవరకూ నమ్మవచ్చూ అనే విషయం తెలుసుకొనేందుకు, వారు వ్రాసిన ప్రేమలేఖలు తీసుకుని గ్రాఫాలజీతో కుస్తీలు పడుతున్నారంట.

Wednesday, July 18, 2007

మీరు ఎప్పుడయినా గుడి చుట్టూ మూడు సార్లు తిరిగారా? పోనీ గుడిలోకి వెళ్ళి వచ్చి గుడి మెట్లపై కూర్చున్నారా?

మన పెద్దలు మనము ఎప్పుడయినా గుడికి వెళ్ళితే, గుడిలోకి వెళ్ళే ముందు,గుడి చుట్టూ మూడు సార్లు తిరిగామంటారు.అలాగే గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం పూర్తి అయిన తరవాత వచ్చి గుడి మెట్లపై కూర్చోమంటారు. ఈ ఆచారం ఎందుకొరకు పెట్టారో తెలుసా? మన పూర్వీకుల కాలంలో శృంగార పరిజ్ఞానం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నంతగా లేదు. ఇప్పుడు కాలంలో యువత సిడీల ద్వారాను, టివీల ద్వారాను, పుస్తకాల ద్వారానూ శృంగార పరిజ్ఞానం సంపాదిస్తున్నారు. అయితే ఆ కాలంలో శృంగారం గురించి తెలియాలంటే కామ శాస్త్రం చదవాల్సి వుండేది. అయితే అది కేవలం ఉన్నత శ్రేణి వారు లేదా పండితులకు మాత్రమే అర్ధమయ్యే భాషలో ఉండేది. అయితే ఆ కాలంలో స్త్రీలు గడప దాటి బయటకు వచ్చే వారు కాదు. సామన్యులకు సైతం ఈ కామశాస్త్రాన్ని అందుబాటులోనికి తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో, ఈ శాస్త్రాన్ని శిల్పకళగా మలచి అందరూ చూసే అవకాశముండునట్లుగా దేవాలయాలపై నిలిపే వారు. కాబట్టి గుడికి వచ్చే భక్తులందరూ వీటిని దర్శించే ఉద్దేశ్యంతో గుడిలోకి వెళ్ళే ముందు,గుడి చుట్టూ మూడు సార్లు తిరిగామన్నారు. అలాగే గాలి గోపురాలపై ఉండే విగ్రహాలను చూడడానికి వీలుగా గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం పూర్తి అయిన తరవాత వచ్చి గుడి మెట్లపై కూర్చోమంటారు. అయితే కొందరు ఈ ఉద్దేశ్యాన్ని గుర్తించలేక అలా తిరిగేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ శిల్పకళా లేదు. వాటి అవసరమూ కనిపించడం లేదు. అంతగా అభివృద్ది చెందింది మన యువత.

Wednesday, July 11, 2007

నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలతాయా?

నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలతాయా? నిప్పుల గుండంలో నడవడమనేది అటు హిందూ సాంప్రదాయంలోనూ, ఇటు మహమ్మదీయ సాంప్రదాయంలోనూ మనకు కనిపిస్తుంటుంది. చాలా మంది తమ కోరికలు తీర్చినట్లయితే నిప్పుల గుండంలో నడుస్తామని మొక్కుకుంటారు. అలాగే ఆ మొక్కును తీరుస్తారు కూడా. అయితే మరి నిప్పులగుండంలో నడిస్తే కాళ్ళు కాలవా? అంటే కాలవు అనే చెప్పాలి. ఎందుకంటే నిప్పుల గుండం పొడవు, వెడల్పు,లోతు అనేది ఒక ప్రత్యేకమైన కొలతల ప్రకారం చేస్తారు. అలాగే అందులోని బొగ్గులను ఒక ఉష్ణొగ్రత వరకూ వేడి చేస్తారు. అదనపు ఉష్ణొగ్రత కొరకు నేతిలో తడిపిన వస్త్రాలను పరుస్తారు. ఇక్కడ నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలక పోవడానికి 2 కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 1. ప్రతీ మనిషి శరీరంలొనూ, అరికాళ్ళలోనూ కొంత తేమ ఉంటుంది. మనం నిప్పులపై కాలు వేసినపుడు ఆ వేడిని అరికాలిలోని తేమ పీల్చుకుంటుంది. కాబట్టి ఈ తేమ ఆరిపోయేలోపల మనము కాలు తీయవలసి వుంటుంది లేనిచో కాళ్ళు కాలిపోయే అవకాశం వుంది. అంతే కాకుండా నిప్పులపై నుశి/బూడిద ఉన్నా కాళ్ళు కాలతాయి. అందుకే బూడిద ఏర్పడకుండా విసురుతుంటారు. అంతేకాకుండా మన శరీరంలొనూ అదనపు తేమ కోసం నిప్పుల గుండంలో నడిచే ముందు తలారా స్నానం చేస్తారు. 2. అలా నడిచే తప్పుడు దైవ నామస్మరణ చేస్తూ తమను తాము హిప్నటైజ్ చేసుకుంటారు. ఈ రెండు కారణాల వల్ల నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలవు.

Tuesday, July 3, 2007

మనము బస్సును చూడగానే అది ఎక్స్ ప్రెస్స్ లేదా ప్యాసింజెర్ బస్సు లేదా పాస్ట్ ప్యాసింజెర్ అనేది వెంటనే తెలుసుకోవచ్చా?

మనము బస్సును చూడగానే అది ఎక్స్ ప్రెస్స్ లేదా ప్యాసింజెర్ బస్సు లేదా పాస్ట్ ప్యాసింజెర్ అనేది వెంటనే తెలుసుకోవచ్చు. అసలు ఆర్.టి.సి. బస్సులలో ఉన్న ముఖ్యమైన రకాలు మూడు.(హైదరాబాదు లాంటి నగరాలలో కాదు). అవి 1. ప్యాసింజెర్ బస్సు, 2. ఎక్స్ ప్రెస్స్, 3. పాస్ట్ ప్యాసింజెర్ బస్సులు.ప్యాసింజెర్ బస్సు ఎక్కువ స్టేజ్ లలో ఆగుతుంది మరియు టికెట్ చార్జీలు కూడా తక్కువ. అదే ఎక్స్ ప్రెస్స్ అయితే తక్కువ లేదా మెయిన్ స్టేజ్ లలో మాత్రమే ఆగుతుంది. టికెట్ చార్జీలు కూడా ఎక్కువ.ఇక పాస్ట్ ప్యాసింజెర్ అయితే తక్కువ లేదా మెయిన్ స్టేజ్ లలో ఆగుతుంది మరియు టికెట్ చార్జీలు తక్కువ. మనకు ఎర్రబస్సు అయితే ప్యాసింజెర్ అని, ఆకుపచ్చ బస్సు అయితే ఎక్స్ ప్రెస్స్ అని తెలుసుకొనేవారము. అయితే ఆర్.టి.సి. వారు అపుడపుడు బస్సులను వారికి వీలుగా ఏ బస్సులు కావాలనుకుంటే ఆ బస్సులను ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టీ ఒక బస్సును చూడగానే అది ప్యాసింజెర్ బస్సా లేక ఎక్స్ ప్రెస్సా లేక పాస్ట్ ప్యాసింజెరా అనేది దానికి తగిలించిన బోర్డును బట్టి తెలుసుకోవచ్చు. నల్లటి అక్షరాలు ఉంటే అది ప్యాసింజెర్,ఎర్రటి అక్షరాలు ఉంటే అది ఎక్స్ ప్రెస్స్, అదే పచ్చటి అక్షరాలు ఉంటే అది పాస్ట్ ప్యాసింజెర్.

Sunday, July 1, 2007

మనము గుడిలోనికి వెళ్ళకుండా అది వైష్ణవాలయమో లేక శివాలయమో చెప్పగలమా?

మనము గుడిలోనికి వెళ్ళకుండా అది వైష్ణవాలయమో లేక శివాలయమో అనేది చాలా సులువుగా చెప్పవచ్చు.వైష్ణవాలయం అనేది విష్ణు మూర్తి కొలువై ఉండే ఆలయం.శివాలయం అనేది పరమశివుదు కొలువై ఉండే ఆలయం. నిలువు బొట్టు పెట్టే వారిని వైష్ణవులు అని, అడ్డబొట్టు పెట్టే వారిని శైవులు అని పిలుస్తారు. వైష్ణవులు విష్ణుమూర్తిని ఆరాధిస్తే, శైవులు సివుని ఆరాధిస్తారు. ఒక ఆలయంలొనికి ప్రవేశించకుండా అది వైష్ణవాలయమో లేక శివాలయమో అనేది చెప్పాలంటే ఆ గుడి గోపురం వంక చూస్తే సరి. వైష్ణవాలయం అయితే శంకు చక్రాలు గోపుర కలశంపై ఉంటాయి. అదే శివాలయం అయితే త్రిశూలం ఉంటుంది.