భారత యుద్దం ముగిసిన తరువాత ధర్మరాజు మరణించిన తన బంధు మిత్రులందరికీ పితృకార్యం చేస్తున్నాడు. ఆ సమయంలో కుంతీదేవి కర్ణుడికి కూడా పితృకార్యం నిర్వహించమని ధర్మరాజుకు చెప్పింది. ఆమె అలా కోరడానికి కారణమేమిటని ధర్మరాజు ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు కుంతి తాను కన్యగా వున్నపుడు సూర్యుడి వరం వలన కర్ణుడు తనకు పుట్టిన సంగతి తెలిపింది. ఆ విషయం తెలిసిన ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. కర్ణుడు ఆమెకు తమకంటే ముందుగా పుట్టిన కారణంగా అన్న అవుతాడని, అతడిని తమ చేతులారా చంపామని ఎంతో బాధ పడ్డాడు. అతడికి కుంతిపై విపరీతమైన కోపం వచ్చింది. ఆ విషయం ముందేచెప్పివుంటే అతడితో తమకు వైరం వుండేది కాదని, అసలు భారత యుద్డం సంభవించేదే కాదని పలికి ఆమె ఆ రహస్యం అంతకాలంగా దాచబట్టే ఈ దుష్పరిమాణం ఏర్పడిందని చెప్పి "ఇకపై స్త్రీల నోట రహస్యం దాగదు" అని శపించాడు. ఈ భారత గాధ ఆధారంగానే "స్త్రీల నోట నువ్వు గింజ నానదు" అనే సామెత వాడుకలోకి వచ్చింది. నువ్వుగింజ నానడానికి ఎంతోసమయం పట్టదు. అటువంటి నువ్వుగింజ నానే సమయం స్త్రీలు తమ నోట ఇవ్వరని అర్ధం. స్త్రీలు నిరంతరం ఏదో విషయం మాట్లాడతారని, మాట్లాడక ఊరకనే వుండలేరని దీని భావం. కాని సామాజికంగాను, వైజ్ఞానికంగాను స్త్రీలు అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో ఈ సామెతకి అర్ధం వుండదని చెప్పవచ్చు.
1 comment:
బాగుందండి.
Post a Comment