Sunday, January 27, 2008

జీర్ణం...జీర్ణం... వాతాపి జీర్ణం గురించి తెలుసా?


మన ఇంటిలో చిన్న పిల్లలకు ఏదైనా పెట్టిన తరువాత, ఆ తిన్నది అరగడం గురించి వారి చిన్ని పొట్టపై సుతారంగా రాస్తూ జీర్ణం...జీర్ణం... వాతాపి జీర్ణం అంటుంటారు. దీని వెనుకాల ఒక పురాణ గాధ వుంది. ఈ జీర్ణం ... జీర్ణం ... వాతాపి జీర్ణం గురించిన ప్రస్తావన త్రేతాయుగం నాటి రామాయణములో అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం గురించి తెలియచేస్తూ వస్తుంది.
పూర్వకాలంలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీరు నరమాంస భక్షకులై దారిన పోతున్న బ్రాహ్మణులను మాయ చేసి భక్షిస్తుండేవారు. అదేలాగంటే ఇల్వలుడు బ్రాహ్మణ రూపం, వాతాపి గొర్రె రూపం ధరించి బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి, అయ్యా ఈ రోజు మా తండ్రిగారి ఆబ్దికము,తిధి తద్దినము పెట్టాలి గాబట్టీ మీరు దయచేసి భోక్తగా రండి అని పిలిచేవాడు.సర్వసాధారణంగా తండ్రి గారి తద్దిణానికి భోక్త పిలిస్తే ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప రాను అని అనకూడదు. అందుకని బ్రాహ్మణులను వెళ్ళేవారు. అపుడు గొర్రెని ఇల్వలుడు చంపేసేవాడు. చంపేసి ఆ మాంసం వండేవాడు. వండి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులకు విస్తట్లో వడ్డించేవాడు. బ్రాహ్మణులను ఆ మాంసం తినేవారు.తిన్నతరువాత హస్తోదకం ఇచ్చేవాడు. అలా ఇచ్చి వాతాపి రా... అనేవాడు. అపుడు కడుపులో మాంస రూపంలో వున్న వాతాపి గొర్రె రూపం దాల్చి కడుపు చీల్చుకుని వచ్చే వాడు. దానితో బ్రాహ్మణుడు చనిపోయేవాడు. అప్పుడు రాక్షసులు ఇద్దరూ ఆ మాంసాన్ని భుజించేవారు. 
అలా చాలాకాలం జరిగిన తరువాత అటుగా అగస్త్య మహర్షి వస్తున్నారు. ఎప్పటిలానే మాయా రూపాలు ధరించడం, మహర్షిని రమ్మనడం, భోజనం పెట్టడం చేసాడు. మహర్షి భోంచేసిన తరువాత పొట్టపై చేయి ఉంచుకుని సుతారంగ రాసుకుంటూ జీర్ణం...జీర్ణం... వాతాపి జీర్ణం అనుకున్నారు. దానితో కడుపులో ఉన్న వాతాపి కాస్తా జీర్ణం అయిపోయాడు. ఇక ఇల్వలుడు వాతాపి రా... అని పిలిస్తే ఇంకేం వాతాపి ఎప్పుడొ జీర్నమయిపోయాడు అన్నరు. దానితో ఆగ్రహించిన ఇల్వలుడు భయంకర రూపం దాల్చి అగస్తుడిని చంపడానికి వస్తుంటే మహరిషి కోపంతో ఒక్కసారి హుంకరించాగానే ఆ ఇల్వలుడు భస్మమైపోయాడు.
అప్పటి నుండి తిన్న పధార్ధమేదైనా అరగక ఇబ్బంది పెడుతుంటే జీర్ణం...జీర్ణం... వాతాపి జీర్ణం అనడం పరిపాటి అయిపోయింది.



Wednesday, January 23, 2008

ఇంటిలో ప్రతీరోజూ తులసి మొక్కని పూజించాలంటారు ఎందుకు?


ఇంటిలో ప్రతీరోజూ తులసి మొక్కని పూజించినా, పూజించక పోయినా తులసిమొక్కని మాత్రము తప్పనిసరిగా పెంచాలి. ఎందుకంటే తులసి యొక్క ఔషధ గుణములను ద్రుష్టిలో ఉంచుకుని మన పెద్దలు పెరటిలో తులసి మొక్కను పూజించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. తులసి నుండి వచ్చే గాలి పీల్చినట్లయితే కలరా వంటి వ్యాధులు దరి చేరవు.
ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే లక్శణం తులసికి వుంది. అందుకే అన్ని రకముల అవకాశములు ప్రయత్నించిన 
తరువాత ఆఖరి ప్రయత్నముగా తులసి తీర్ధము నోటిలో పోస్తారు.