Sunday, October 21, 2007

ఏప్రిల్ 1వ తేదీ ఫూల్స్ డే అని పేరెందుకొచ్చిందో తెలుసా?

ఒక్కొక్క దేశంలో ఒక్కో ఆచార సాంప్రదాయాలు వ్యవహారంలో ఉన్నాయి. వాటి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. వాటిలో ఏప్రిల్ 1 కూడా ఇటువంటి గుర్తింపు పొందిన రోజే. ప్రపంచం మొత్తం ఏప్రిల్ 1ని ఫూల్స్ డేగా పరిగణించడం జరుగుతుంది. ఆ రోజు అందరూ బంధువులను, స్నేహితులను నవ్వించడం, హాస్యాస్పదమైన బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం చేస్తుంటారు. ముందుగా ఏప్రిల్1ని ఫూల్స్ డేగా పరిగణించడం ఫ్రాన్స్ లోని 1564వ సంవత్సరం తరువాత జరిగింది. అంతకు ముందు ఐరొపా ఖండంలోని కొత్త సంవత్సరం ఏప్రిల్1న ప్రారంభం అయ్యింది. అందువలన ఈ రోజున పండుగ వేడుకలు జరుపుకునేవారు. ఆ రోజున ప్రజలు అందరూ బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకునేవారు. స్నేహితుల ఇళ్ళకు విందులకు కూడా వెళ్ళేవారు. ఇలా వుండగా క్రీ.శ. 1564లో ఫ్రాన్స్ రాజు చార్లెస్-10 క్రొత్త క్యాలెండరు వాడమని ఆజ్ఞాపించాడు. ఈ క్యాలెండరు ప్రకారం జనవరి 1తో నూతన సంవత్సరం ప్రారంభమైంది. అప్పుడు చాలామంది ప్రజలు ఈ కొత్త క్యాలెండరును అమలు పరిచారు కాని కొందరు మూర్ఖులు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏప్రిల్ 1నే కొత్త సంవత్సరంగా భావిస్తూ వచ్చారు. అందువలన ఇరుగుపొరుగు వాళ్ళు, స్నేహితులు వీళ్ళను అపహాస్యం చేసేవారు, ఉత్తుత్తి బహుమతులను ఇచ్చేవారు. కనుక ఇటువంటి వారిని ఉద్దేశించి ఉపయోగించిన పదమే 'ఏప్రిల్ ఫూల్శ్. ఈ విధంగా ఏప్రిల్1 ఫూల్స్ డేగా పేరుగాంచింది.

Thursday, October 4, 2007

చేతులకు గాజులు తొడిగించుకోవడం అనేది ఎలా వచ్చిందో మీకు తెలుసా?



చేతులకు గాజులు తొడిగించుకోవడం గురించి ఒక పురాణగాధ వుందిలేండి. అదేమిటంటే జమదగ్ని మహాముని మహా కోపిష్టి. అది జగమెరిగిన సత్యం. అతని భార్య రేణుకా దేవి. ఆవిడ మహా పతివ్రత. అందుచే ఆవిడ ఇసుక రేణువులతో చేసిన కుండతో నీళ్ళు తీసుకు వచ్చేదట. అయితే ఒక రోజు ఆవిడ కుండతో నీళ్ళు తీసుకుని వస్తుండగా దశరధ మహారాజు ఆ దారంటా వెళుతున్నాడట. అపుడు ఆమె ఔరా! ఈ రాజెంత అందగాడు అనుకున్నదట. వెంటనే ఆ కుండ పగిలి పోయిందట. ఆశ్రమానికి వట్టి చేతులతో వచ్చిన రేణుకాదేవిని చూసి, జరిగినదంతా దివ్య దృష్టితొ గ్రహించి వెంటనే కుమారుడైన పరశు రాముడితో నీ తల్లిని నరికేయమన్నడట. పితృవాఖ్య పరిపాలకుడైన పరశురాముడు ఎందుకు ఏమిటి అని అడుగకుండా తల్లిని తన గండ్ర గొడ్డలితో నరికేసాడట. తరువాత తన తల్లి మరణానికి రాజ వంశీయులే కారణమని తలచి వారిపై పగబట్టి అసలు ఈ భూమిపై క్షత్రియుడనేవాడు లేకుండా చేస్తానని ప్రతిన బూని కనిపించిన క్షత్రియుడనల్లా హతమార్చేవాడంట. ఒకసారి అతను అయోధ్యా నగరానికి విచ్చేసాడంట. అప్పటికే అతని గురించి వినివుండటంతో దశరధుడు పారిపోయి రాణి వాసములో దాక్కున్నాడంట. అపుడు పరశు రాముడు రాణి వాసమునకు వచ్చి రాజు ఇక్కడ వున్నడా అని అడిగితే లేరని సమాధనమివ్వగా ఒప్పుకోక మీరంతా వచ్చి నాముందు నిలుచోండి అనగా రాణి వాసపు స్త్రీలు ఎవ్వరూ పరాయి పురుషుని కంట పడరని, కావాలంటే మాచేతులు బయటకు పెడతాము వాతికి వున్న గాజులను మీరు చూడవచ్చును అని తెలుపగా, పరుశరాముడు అలాగే కానిమ్మని పలుకగా దశరధుడు రాణి వాసపు స్త్రీలతో బాటు చేతులకు గాజులు తొడిగించుకుని బైటకు చేతులు బయట పెట్టడత. అపుడు సరేనని పరశు రాముడు వెనుదిరిగాడంట. ఆ విధముగా దశరధుడు ప్రాణాలు కాపాడుకున్నడట. అప్పటినుండి ఎవరైన ఏదైనా ఆపద వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కొనక మూలన కూర్చుంటె చేతులకు గాజులు తొడిగించుకున్నవా అని అనడం పరిపాటి అయ్యిందట. ఇది నా చిన్నపుడు మా పెద్దలు చెప్పగా తెలుసుకున్నాను. ఇందులో ఏవైన దోషాలుంటె తెలియ చేస్తే దిద్దుకుంటాను.