Sunday, September 16, 2007

క్యాలండర్లో సంవత్సరానికి 365 రోజులే వుంటాయి. ఎందుకో మీకు తెలుసా?


భూమి మీద నివసిస్తున్న మనకు భూమి కదులుతున్నట్టుగా ఏమాత్రం అనిపించదు. కాని నిజానికి భూమి నిరంతరంగా వేగంగా కదులుతూనే వుంతుంది. బొంగరం మాదిరిగా తన చుట్టూ తాను గంటకు 800 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూనే వుంటుంది. అదే సమయంలో భూమి అంతరిక్షంలోని సూర్యుని చుట్టూ కూడా తన కక్ష్యలో పరిభ్రమిస్తూ వుంటుంది. అంటే భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి పరిభ్రమించాలంటె 939,886,400 కిలోమీటర్ల దూరం ప్రయానం చేయాలి. ఇందుకోసం ఆశ్చర్యకర రీతిలో గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంత వేగంతో తిరిగినా ఈ దూరాన్ని ప్రయానించేందుకు భూమికి 365.242 రోజులు పడుతుంది. ఈ సమయాన్నే ఒక సంవత్సర కాలంగా లెక్కించి, సంవత్సరానికి 365 రోజులని అంటున్నాము. అయితే అధికంగా వున్న 0.242 రోజుల సమయమును లెక్కిస్తే ఇది నాలుగు సంవత్సరాలకు ఒక రోజు (24 గంటలు) అవుతుంది. అందుకని ఆ ఒక్క రోజును మన క్యాలండర్ లో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కలుపుతాం. ఆ సంవత్సరాన్నే లీపు సంవత్సరంగా పిలుస్తారు.అదండీ విషయం.

Tuesday, September 4, 2007

మీకు కోతి పుండు బ్రహ్మ రాక్షసి అనే సామెత గురించి తెలుసా?

కోతులు సహజంగా సమూహాలుగా గాని, కొన్ని గాని కలసి సంచరిస్తూ ఉంటాయి. అవి చెట్ల మీద నుండి చెట్ల మీదకు ఎగురుతూ వెడుతుంటాయి. ఊళ్ళలొ అయితే ఇళ్ళ ప్రహారీ గోడల మీద ఒకటి వెనుకగా ఒకటి పోతుంటాయి. అలాగే అడవులలో కూడా గుంపులుగానే జీవిస్తుంటాయి. అవి అలా సంచరించేటప్పుడు దెబ్బలు తగలడం వల్ల గాని లేదా వేటగాడు ప్రయోగించిన రాయి లేదా ఆయుధం వల్ల గాని ఒక కోతి గాయపడితే మిగిలిన కోతులు ఆ కోతిని పరామర్శ చేస్తాయి.అలా ప్రతీ కోతి ఆ గాయపడిన కోతిని పరామర్శించేటప్పుడు తన చేతి గోళ్ళతో ఆ గాయాన్ని గోకి చూసి ఏదో ఆకు తెచ్చి దానిమీద వేసి వెడుతుంది. అవి ఆ విధంగా తమ సానుభూతిని, ఆపేక్షను వెల్లడిస్తాయి. కాని ప్రతీ కోతి ఆ గాయాన్ని గోకి చూడడం వల్ల ఆ కోతికి తగిలిన గాయం చిన్నదైనా అది పెద్దగా విస్తరించి చివరికది మానడం దుర్లభమవుతుంది. ఆ కారణంగానే "కోతిపుండు బ్రహ్మ రాక్ష్సి" అనే సామెత వాడుకలోనికి వచ్చింది. ఇది కోతుల నైజాన్ని తెలిపే సామెత. ఆపేక్షతో చేసినప్పటికీ అజ్ఞానులు చేసే పనులు చివరికి బాధగా పరిణమించడాన్ని తెలియజెయడానికి ఈ సామెతతో సూచిస్తారు.