Saturday, November 24, 2007

జ్యోతి-The Light of Telugu Bloggers



జ్యోతి-ఈ పేరు గురించి తెలుగు బ్లాగర్లకు ఎవరూ పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే సంవత్సర పైగా తెలుగు గుంపులో ఉంటూ, తన బ్లాగులలో 1000కి పైగా పోస్టులు చేసి ప్రచండ బ్లాగరి అనే బిరుదు పొందిన ఏకైక తెలుగు మహిళ మన జ్యోతి గారు. జ్యోతి వలబోజు గా కంటే జ్యోతక్కగానే అందరికీ పరిచయం. ఈమె బి.కాం.వరకూ చదివిన సాధారణ గృహిణి అంటే ఎవరికీ నమ్మశక్యం కాదు. అలా వుంటాయి ఆమె రచనలు. ఆమె స్పృశించని విషయం లేదు. ఆవకాయ పచ్చడి నుండి హైదరాబాది బిరియాని వరకూ వంటలు, ఆత్రేయ నుండి హిమేష్ రేష్మియా వరకూ పాటలు, నవ్వుల పువ్వులు పూయించడం దగ్గరనుండి మెదడకు పదును పెట్టి నవ్వించే ఫజిల్స్ వరకూ హాస్యం,పురాణ విషయాలు, కవితలు అన్ని రకాలు ఆమె బ్లాగుల నుండి జాలు వారినవే. వీటన్నిటి కంటే ముఖ్యంగా ఆమె సహన గుణం మరియు సహాయ గుణం గురించి చెప్పు కోవాలి. ఈ పోస్ట్ నేను వ్రాయాలనుకోవడానికి ముఖ్య కారణం అదే. అసలు బ్లాగు అంటే ఏమిటో తెలియని నాలాంటి వారికెందరకో తన అమూల్యమైన సలహాలు,సూచనలతో బ్లాగులు నెలకొల్పడానికి కారణమయ్యారు. ఆవిడ కృషి మూలముగానే మన తెలుగు బ్లాగర్స్ అందరికీ ఉపయోగపడే ఒక సాంకేతిక బ్లాగు తయ్యారయ్యిందని మనకు తెలుసు. అదే నల్లమోతు శ్రీధర్ గారి శ్రీధర్ సాంకేతికాలు. మన తెలుగు బ్లాగర్లు వ్రాసే పోస్టులను చదివి వాటిపై వ్యాఖ్యలు వ్రాస్తూ బ్లాగర్లలో కొత్త ఉత్సాహన్ని నింపుతుంటారు. కంప్యూటర్ ఎరాలో ఆమె వ్రాసిన తెలుగు వెలుగులు వ్యాసం ఆమె కీర్తి కిరీటంలొ ఒక కలికి తురాయి. సార్ధక నామధేయం అంటే ఏమిటో జ్యోతి గారిని చూసాకే తెలిసింది. జ్యోతి ఏ విధంగా తన వెలుగు ద్వారా ఇతరులకు మార్గం చూపుతుందో, మన జ్యోతిగారు కూడా తన సలహాలతో బ్లాగర్లకు దారి చూపిస్తుంటారు. ఆవిడను ఏ విషయం అడిగినా విసుగు చెందక చాలా ఓపికతో చెబుతుంటారు, ఆమెకు తెలియని విషయమైతే, తెలిసిన వారిని అడిగి మరీ మన సందేహాలు తీరుస్తుంటారు. అందుకే ఆవిడను తెలుగు బ్లాగర్లకు వెలుగురేఖ అని పోల్చడంలొ అతిశయోక్తి లేదేమో. మన తెలుగు బ్లాగర్లు గుంపులోని సంఖ్య 1000కు చేరుకుంటున్న శుభసందర్భములో జ్యోతి గారికి అనె బిరుదుని గాని అటువటి సమాన అర్ధం వచ్చే తెలుగు పదంతో గాని సత్కరిస్తే బావుంటుందేమో. మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో వ్రాయండి.

Sunday, October 21, 2007

ఏప్రిల్ 1వ తేదీ ఫూల్స్ డే అని పేరెందుకొచ్చిందో తెలుసా?

ఒక్కొక్క దేశంలో ఒక్కో ఆచార సాంప్రదాయాలు వ్యవహారంలో ఉన్నాయి. వాటి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. వాటిలో ఏప్రిల్ 1 కూడా ఇటువంటి గుర్తింపు పొందిన రోజే. ప్రపంచం మొత్తం ఏప్రిల్ 1ని ఫూల్స్ డేగా పరిగణించడం జరుగుతుంది. ఆ రోజు అందరూ బంధువులను, స్నేహితులను నవ్వించడం, హాస్యాస్పదమైన బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం చేస్తుంటారు. ముందుగా ఏప్రిల్1ని ఫూల్స్ డేగా పరిగణించడం ఫ్రాన్స్ లోని 1564వ సంవత్సరం తరువాత జరిగింది. అంతకు ముందు ఐరొపా ఖండంలోని కొత్త సంవత్సరం ఏప్రిల్1న ప్రారంభం అయ్యింది. అందువలన ఈ రోజున పండుగ వేడుకలు జరుపుకునేవారు. ఆ రోజున ప్రజలు అందరూ బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకునేవారు. స్నేహితుల ఇళ్ళకు విందులకు కూడా వెళ్ళేవారు. ఇలా వుండగా క్రీ.శ. 1564లో ఫ్రాన్స్ రాజు చార్లెస్-10 క్రొత్త క్యాలెండరు వాడమని ఆజ్ఞాపించాడు. ఈ క్యాలెండరు ప్రకారం జనవరి 1తో నూతన సంవత్సరం ప్రారంభమైంది. అప్పుడు చాలామంది ప్రజలు ఈ కొత్త క్యాలెండరును అమలు పరిచారు కాని కొందరు మూర్ఖులు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏప్రిల్ 1నే కొత్త సంవత్సరంగా భావిస్తూ వచ్చారు. అందువలన ఇరుగుపొరుగు వాళ్ళు, స్నేహితులు వీళ్ళను అపహాస్యం చేసేవారు, ఉత్తుత్తి బహుమతులను ఇచ్చేవారు. కనుక ఇటువంటి వారిని ఉద్దేశించి ఉపయోగించిన పదమే 'ఏప్రిల్ ఫూల్శ్. ఈ విధంగా ఏప్రిల్1 ఫూల్స్ డేగా పేరుగాంచింది.

Thursday, October 4, 2007

చేతులకు గాజులు తొడిగించుకోవడం అనేది ఎలా వచ్చిందో మీకు తెలుసా?



చేతులకు గాజులు తొడిగించుకోవడం గురించి ఒక పురాణగాధ వుందిలేండి. అదేమిటంటే జమదగ్ని మహాముని మహా కోపిష్టి. అది జగమెరిగిన సత్యం. అతని భార్య రేణుకా దేవి. ఆవిడ మహా పతివ్రత. అందుచే ఆవిడ ఇసుక రేణువులతో చేసిన కుండతో నీళ్ళు తీసుకు వచ్చేదట. అయితే ఒక రోజు ఆవిడ కుండతో నీళ్ళు తీసుకుని వస్తుండగా దశరధ మహారాజు ఆ దారంటా వెళుతున్నాడట. అపుడు ఆమె ఔరా! ఈ రాజెంత అందగాడు అనుకున్నదట. వెంటనే ఆ కుండ పగిలి పోయిందట. ఆశ్రమానికి వట్టి చేతులతో వచ్చిన రేణుకాదేవిని చూసి, జరిగినదంతా దివ్య దృష్టితొ గ్రహించి వెంటనే కుమారుడైన పరశు రాముడితో నీ తల్లిని నరికేయమన్నడట. పితృవాఖ్య పరిపాలకుడైన పరశురాముడు ఎందుకు ఏమిటి అని అడుగకుండా తల్లిని తన గండ్ర గొడ్డలితో నరికేసాడట. తరువాత తన తల్లి మరణానికి రాజ వంశీయులే కారణమని తలచి వారిపై పగబట్టి అసలు ఈ భూమిపై క్షత్రియుడనేవాడు లేకుండా చేస్తానని ప్రతిన బూని కనిపించిన క్షత్రియుడనల్లా హతమార్చేవాడంట. ఒకసారి అతను అయోధ్యా నగరానికి విచ్చేసాడంట. అప్పటికే అతని గురించి వినివుండటంతో దశరధుడు పారిపోయి రాణి వాసములో దాక్కున్నాడంట. అపుడు పరశు రాముడు రాణి వాసమునకు వచ్చి రాజు ఇక్కడ వున్నడా అని అడిగితే లేరని సమాధనమివ్వగా ఒప్పుకోక మీరంతా వచ్చి నాముందు నిలుచోండి అనగా రాణి వాసపు స్త్రీలు ఎవ్వరూ పరాయి పురుషుని కంట పడరని, కావాలంటే మాచేతులు బయటకు పెడతాము వాతికి వున్న గాజులను మీరు చూడవచ్చును అని తెలుపగా, పరుశరాముడు అలాగే కానిమ్మని పలుకగా దశరధుడు రాణి వాసపు స్త్రీలతో బాటు చేతులకు గాజులు తొడిగించుకుని బైటకు చేతులు బయట పెట్టడత. అపుడు సరేనని పరశు రాముడు వెనుదిరిగాడంట. ఆ విధముగా దశరధుడు ప్రాణాలు కాపాడుకున్నడట. అప్పటినుండి ఎవరైన ఏదైనా ఆపద వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కొనక మూలన కూర్చుంటె చేతులకు గాజులు తొడిగించుకున్నవా అని అనడం పరిపాటి అయ్యిందట. ఇది నా చిన్నపుడు మా పెద్దలు చెప్పగా తెలుసుకున్నాను. ఇందులో ఏవైన దోషాలుంటె తెలియ చేస్తే దిద్దుకుంటాను.

Sunday, September 16, 2007

క్యాలండర్లో సంవత్సరానికి 365 రోజులే వుంటాయి. ఎందుకో మీకు తెలుసా?


భూమి మీద నివసిస్తున్న మనకు భూమి కదులుతున్నట్టుగా ఏమాత్రం అనిపించదు. కాని నిజానికి భూమి నిరంతరంగా వేగంగా కదులుతూనే వుంతుంది. బొంగరం మాదిరిగా తన చుట్టూ తాను గంటకు 800 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూనే వుంటుంది. అదే సమయంలో భూమి అంతరిక్షంలోని సూర్యుని చుట్టూ కూడా తన కక్ష్యలో పరిభ్రమిస్తూ వుంటుంది. అంటే భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి పరిభ్రమించాలంటె 939,886,400 కిలోమీటర్ల దూరం ప్రయానం చేయాలి. ఇందుకోసం ఆశ్చర్యకర రీతిలో గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంత వేగంతో తిరిగినా ఈ దూరాన్ని ప్రయానించేందుకు భూమికి 365.242 రోజులు పడుతుంది. ఈ సమయాన్నే ఒక సంవత్సర కాలంగా లెక్కించి, సంవత్సరానికి 365 రోజులని అంటున్నాము. అయితే అధికంగా వున్న 0.242 రోజుల సమయమును లెక్కిస్తే ఇది నాలుగు సంవత్సరాలకు ఒక రోజు (24 గంటలు) అవుతుంది. అందుకని ఆ ఒక్క రోజును మన క్యాలండర్ లో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కలుపుతాం. ఆ సంవత్సరాన్నే లీపు సంవత్సరంగా పిలుస్తారు.అదండీ విషయం.

Tuesday, September 4, 2007

మీకు కోతి పుండు బ్రహ్మ రాక్షసి అనే సామెత గురించి తెలుసా?

కోతులు సహజంగా సమూహాలుగా గాని, కొన్ని గాని కలసి సంచరిస్తూ ఉంటాయి. అవి చెట్ల మీద నుండి చెట్ల మీదకు ఎగురుతూ వెడుతుంటాయి. ఊళ్ళలొ అయితే ఇళ్ళ ప్రహారీ గోడల మీద ఒకటి వెనుకగా ఒకటి పోతుంటాయి. అలాగే అడవులలో కూడా గుంపులుగానే జీవిస్తుంటాయి. అవి అలా సంచరించేటప్పుడు దెబ్బలు తగలడం వల్ల గాని లేదా వేటగాడు ప్రయోగించిన రాయి లేదా ఆయుధం వల్ల గాని ఒక కోతి గాయపడితే మిగిలిన కోతులు ఆ కోతిని పరామర్శ చేస్తాయి.అలా ప్రతీ కోతి ఆ గాయపడిన కోతిని పరామర్శించేటప్పుడు తన చేతి గోళ్ళతో ఆ గాయాన్ని గోకి చూసి ఏదో ఆకు తెచ్చి దానిమీద వేసి వెడుతుంది. అవి ఆ విధంగా తమ సానుభూతిని, ఆపేక్షను వెల్లడిస్తాయి. కాని ప్రతీ కోతి ఆ గాయాన్ని గోకి చూడడం వల్ల ఆ కోతికి తగిలిన గాయం చిన్నదైనా అది పెద్దగా విస్తరించి చివరికది మానడం దుర్లభమవుతుంది. ఆ కారణంగానే "కోతిపుండు బ్రహ్మ రాక్ష్సి" అనే సామెత వాడుకలోనికి వచ్చింది. ఇది కోతుల నైజాన్ని తెలిపే సామెత. ఆపేక్షతో చేసినప్పటికీ అజ్ఞానులు చేసే పనులు చివరికి బాధగా పరిణమించడాన్ని తెలియజెయడానికి ఈ సామెతతో సూచిస్తారు.

Tuesday, August 28, 2007

ఆడవారి నోట నువ్వు గింజ నానదు అనే సామెత ఎలా వచ్చిందో తెలుసా?

భారత యుద్దం ముగిసిన తరువాత ధర్మరాజు మరణించిన తన బంధు మిత్రులందరికీ పితృకార్యం చేస్తున్నాడు. ఆ సమయంలో కుంతీదేవి కర్ణుడికి కూడా పితృకార్యం నిర్వహించమని ధర్మరాజుకు చెప్పింది. ఆమె అలా కోరడానికి కారణమేమిటని ధర్మరాజు ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు కుంతి తాను కన్యగా వున్నపుడు సూర్యుడి వరం వలన కర్ణుడు తనకు పుట్టిన సంగతి తెలిపింది. ఆ విషయం తెలిసిన ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. కర్ణుడు ఆమెకు తమకంటే ముందుగా పుట్టిన కారణంగా అన్న అవుతాడని, అతడిని తమ చేతులారా చంపామని ఎంతో బాధ పడ్డాడు. అతడికి కుంతిపై విపరీతమైన కోపం వచ్చింది. ఆ విషయం ముందేచెప్పివుంటే అతడితో తమకు వైరం వుండేది కాదని, అసలు భారత యుద్డం సంభవించేదే కాదని పలికి ఆమె ఆ రహస్యం అంతకాలంగా దాచబట్టే ఈ దుష్పరిమాణం ఏర్పడిందని చెప్పి "ఇకపై స్త్రీల నోట రహస్యం దాగదు" అని శపించాడు. ఈ భారత గాధ ఆధారంగానే "స్త్రీల నోట నువ్వు గింజ నానదు" అనే సామెత వాడుకలోకి వచ్చింది. నువ్వుగింజ నానడానికి ఎంతోసమయం పట్టదు. అటువంటి నువ్వుగింజ నానే సమయం స్త్రీలు తమ నోట ఇవ్వరని అర్ధం. స్త్రీలు నిరంతరం ఏదో విషయం మాట్లాడతారని, మాట్లాడక ఊరకనే వుండలేరని దీని భావం. కాని సామాజికంగాను, వైజ్ఞానికంగాను స్త్రీలు అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో ఈ సామెతకి అర్ధం వుండదని చెప్పవచ్చు.

Wednesday, August 22, 2007

మీరు మీ ఇంటిలోనే స్వంతముగా ఒక వెండి గుడ్డు తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

అవునండీ. మీరు మీ ఇంటిలోనే స్వంతముగా ఒక వెండి గుడ్డు తయారు చేసుకోవచ్చు.   ఇప్పుడు వెండి ఎక్కడనుండి తీసుకురాము అనుకునేరు.ఈ గుడ్డుకి నిజమైన వెండి అవసరం లేదు. ఇది ఒక సైన్సు ఇంద్రజాలం. ఇది తయారు చేయడానికి మీకు కావలసినవి. ఒక గుడ్డు, గాజు గ్లాసు, అందులో పూర్తిగా నీరు, ఒక దీపం అవసరం. ముందుగా దీపాన్ని వెలిగించి గుడ్డును దానికి కొంచెం దూరంలో పట్టుకోవాలి దాని పొగ తగిలేటట్టు ఉండాలి. అపుడు గుడ్డు నిండా మసి అంటుకునేటట్టు చూడాలి. గుడ్డు మొత్తం నల్లగా తయారైన తరువాత దానిని జాగ్రత్తగా గాజు గ్లాసులో ఉన్న నీటిలో వేయండి. ఇప్పుడు చూడండి మీకోసం ఒక వెండి గుడ్డు తయారుగా వుంటుంది. నల్లటి గుడ్డు నీటిలో ఎలా మెరిసి పోతుందో మీరే చూడగలరు.